వరల్డ్ కప్ : మనోళ్లు హిట్ అవుతారా

వరల్డ్ కప్ : మనోళ్లు హిట్ అవుతారా

ఇండియా టాప్​ఆర్డర్​ లైనప్​లో ఉన్న ఏకైక లెఫ్టాండర్​ బ్యాట్స్​మన్​ శిఖర్​ ధవన్. గత కొంత కాలంగా టీమిండియా విజయాలకు ఓ పిల్లర్​గా మారాడు కూడా. అతని నైపుణ్యం, దూకుడు, విధ్వంసం.. టీమిండియాకు తిరుగులేని ఆరంభానివ్వడంలో ఎంతో తోడ్పడుతున్నాయి. ధవన్​ చేసే ఎదురుదాడికి తట్టుకోలేక ప్రత్యర్థి జట్లు ఆరంభంలోనే మ్యాచ్​పై పట్టు కోల్పోతున్నాయి. దీంతో లైనప్​లో వచ్చే మిగతా బ్యాట్స్​మన్​ కు సులువుగా బ్యాటింగ్‌‌‌‌ చేసే అవకాశం లభిస్తున్నది. ఐసీసీ ఈవెంట్లలో ఇండియా జట్టు బరిలోకి దిగుతుందంటే మొట్టమొదట గుర్తొచ్చేది ధవన్​ పేరే. ఎందుకంటే ఎలాంటి ప్రత్యర్థి ఎదురైనా.. తనట్రేడ్​ మార్క్​ షాట్లతో బెంబెలేత్తించడంలో ఈ గబ్బర్​ రూటే సపరేటు​. రోహిత్​తో సమన్వయం చేసుకోవడంతో మొదలుపెడితే.. ధనాధన్​ మెరుపు షాట్లతో ఇన్నింగ్స్​కు వాయువేగాన్ని తెచ్చిపెడుతాడు.  రోహిత్​ విఫలమైనా ప్రతిసారి తాను ఉన్నానంటూ జట్టకు అండగా నిలిచిన సందర్భాలు కొకొల్లలు. అయితే ఐసీసీ ఈవెంట్లను పక్కనబెడితే ఇంగ్లండ్​ పిచ్ లపై అతనికి ఉన్న రికార్డు కూడా టీమిండియాలో బలమైన ప్లేయర్​గా నిలబెట్టింది.

ఇక్కడి పిచ్​లపై ధవన్​ చెలరేగినంతగా ఎవరూ చెలరేగలేదు. ఐపీఎల్‌‌‌‌కు ముందు ఆసీస్​తో టెస్ట్​ సిరీస్​కు జట్టులో చోటు దక్కకపోవడంతో ఇక ధవన్​ రావడం కష్టమేననుకున్నారు. కానీ మరో కోణంలో ఆలోచిస్తే ధవన్​ తాజాగా ఉండేందుకు ఆ విశ్రాంతి బాగా ఉపయోగపడిందనేది విశ్లేషకుల వాదన. తర్వాత జరిగిన అంతర్జాతీయ మ్యాచ్​లలో ఆడినా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ధవన్​.. ఈ సీజన్​ ఐపీఎల్​ను విజయవంతంగా ముగించాడు. ఈ టోర్నీలో 521 రన్స్​తో అత్యధిక స్కోరు చేసిన నాలుగో ప్లేయర్​గా నిలిచాడు.  బంతిని నిశితంగా గమనించడం, సూపర్బ్​ టైమింగ్​, అటాకింగ్.. ఈ మూడు ధవన్​ బ్యాటింగ్​లో ఉన్న ప్రత్యేకతలు.

బంతిని బలంగా బాదడం రోహిత్​కు సహజసిద్ధంగా వచ్చిన గొప్ప లక్షణం. దీనికి తోడు తిరుగులేని టైమింగ్​ అతని సొంతం. ప్రత్యేకమైన ఈ రెండు లక్షణాలే.. రోహిత్​కు వన్డే క్రికెట్​లో తిరుగులేని క్రేజ్​ను తెచ్చిపెట్టాయి. కోహ్లీతో సమానంగా పరుగుల వరద పారిస్తూ, ఇటు వైస్​ కెప్టెన్​గా తన నాయకత్వ లక్షణాలు చూపెడుతూ టీమిండియాలో కీలక ప్లేయర్​గా ఎదిగాడు. ముంబై తరఫున ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో అదరగొట్టిన రోహిత్​.. 2006–07 రంజీ ట్రోఫీలో గుజరాత్​పై డబుల్​ సెంచరీ చేసి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.  ఆ వెంటనే 2007లో టీమిండియాలో బెర్త్​ఖాయం చేసుకున్నాడు.  అదే ఏడాది జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్​కప్​లో యువరాజ్​గాయపడటంతో చివరి నిమిషంలో సౌతాఫ్రికాపై బరిలోకి దిగాడు.  అప్పట్నించి ఓ స్థాయిలో ఆడినా..  2013 చాంపియన్స్​ట్రోఫీ వరకు మిడిలార్డర్​లో రోహిత్​ అటు ఇటు చక్కర్లు కొట్టాడు తప్పా..  కచ్చితమైన స్థానంలో బ్యాటింగ్ చేయలేదు.

ఓపెనింగ్‌‌‌‌తో మారిన అదృష్టం..

కాలం కలిసొచ్చి ధోనీ..  రోహిత్‌‌‌‌ను ఓపెనర్​గా ప్రమోట్ చేసినప్పట్నించి ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సహచరుడు శిఖర్​ ధవన్​తో కలిసి టీమిండియాకు అద్భుత విజయాలు అందించాడు. వన్డేల్లో మూడు డబుల్​ సెంచరీలు కొట్టి క్రికెట్​ ప్రపంచం నివ్వెరపోయేలా చేశాడు.  అలుపు లేకుండా ఇన్నింగ్స్​ను కొనసాగించడం రోహిత్​లో ఉన్న అరుదైన లక్షణం. ఎంతటి మేటి బ్యాట్స్​మన్​కైనా ఇంగ్లండ్​ గడ్డపై బ్యాటింగ్​ చేయడమంటే కత్తిమీద సాము. అలాంటి పిచ్​లపై కూడా రోహిత్​ అలవోకగా పరుగులు కొల్లగొట్టాడు.  2018లో ఇంగ్లండ్​పై ఆడిన ఐదు వన్డేల సిరీస్​లో రెండు సెంచరీలు బాది తానేంటో నిరూపించుకున్నాడు. 12 ఏళ్ల వన్డే కెరీర్​లో రోహిత్ ఒకే ఒక్క వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ (2015) ఆడాడు. ఈ మెగా ఈవెంట్​లో 8 మ్యాచ్​లు ఆడిన రోహిత్ 47.14 సగటుతో​ 330 పరుగులు చేశాడు. ఓ సెంచరీ, రెండు అర్ధసెంచరీలు చేశాడు.

చేతన్‌‌శర్మ హ్యాట్రిక్‌‌

1987లో ఇండియా, పాకిస్థాన్​ సంయుక్తంగా నిర్వహించిన వరల్డ్‌‌కప్‌‌తో చేతన్‌‌ శర్మ హీరో అయ్యాడు. వరల్డ్‌‌కప్‌‌ చరిత్రలోనే తొలి హ్యాట్రిక్‌‌ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. కపిల్ దేవ్‌‌ నాయకత్వంలోని టీమిండియా డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌గా ఆ టోర్నీ బరిలోకి  దిగి సెమీఫైనల్‌‌ దాటలేకపోయింది. లీగ్‌‌ దశలో అప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌‌ల్లో నాలుగింటిలో గెలిచిన ఇండియా మరో మ్యాచ్‌‌ మిగిలుండగానే సెమీస్‌‌ బెర్త్‌‌ ఖరారు చేసుకుంది. న్యూజిలాండ్‌‌తో చివరి లీగ్‌‌ మ్యాచ్‌‌ ఆడాల్సి ఉంది.  కివీస్‌‌పై గెలవకపోతే ఇండియా సెమీఫైనల్‌‌లో పాకిస్థాన్‌‌ను వారి దేశంలో ఎదుర్కొనాల్సి వచ్చేది. ఒక వేళ గెలిస్తే టేబుల్‌‌ టాపర్‌‌ హోదాలో స్వదేశంలో ఇంగ్లండ్‌‌తో సెమీఫైనల్‌‌ ఆడుతుంది. దీంతో కపిల్‌‌సేన కివీస్‌‌తో పోరును సీరియస్‌‌గా తీసుకుంది. నాగ్‌‌పూర్‌‌లో జరిగిన మ్యాచ్‌‌లో  టాస్‌‌ గెలిచి ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన న్యూజిలాండ్‌‌ 41 ఓవర్లు ముగిసేసరికి 181/5తో బలమైన స్థితిలో ఉంది. అయితే అప్పటిదాకా బౌలింగ్‌‌ చేస్తున్న మనోజ్‌‌ ప్రభాకర్‌‌ను కాదని కపిల్‌‌ 42వ ఓవర్‌‌లో బంతిని  చేతన్‌‌ శర్మకు ఇచ్చాడు. చేతన్‌‌కు అది ఆరో ఓవర్‌‌ కాగా,  అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న రూథర్‌‌ఫర్డ్‌‌ తొలి మూడు బంతులను డిఫెన్స్‌‌ ఆడాడు.

ఆ తర్వాత చేతన్‌‌ వేసిన ఆఫ్‌‌ కట్టర్‌‌ డెలివరీ రూథర్‌‌ఫర్డ్‌‌ బ్యాట్‌‌, ప్యాడ్‌‌ మధ్య ఖాళీలోంచి దూసుకెళ్లి మిడిల్‌‌వికెట్‌‌ను గిరాటేసింది. ఐదో బంతికి యార్కర్‌‌ సంధించిన చేతన్‌‌ వికెట్‌‌కీపర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ ఇయాన్‌‌ స్మిత్‌‌ను ఆఫ్‌‌ స్టంప్‌‌ను లేపేశాడు. దీంతో నాగ్‌‌పూర్‌‌ స్టేడియంలో ఒక్కసారిగా ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. చేతన్‌‌ హ్యాట్రిక్‌‌ నమోదు చేస్తాడా లేదా అని అందరిలోను ఒకటే టెన్షన్‌‌. చివరి బాల్‌‌ వేసే ముందు చేతన్, కపిల్‌‌తో చాలాసేపు మాట్లాడాడు. హ్యాట్రిక్‌‌ బంతిని తెలివిగా ఎదుర్కొనే ప్రయత్నం చేసిన కివీస్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ చాట్‌‌ఫీల్డ్‌‌.. చేతన్‌‌ వేసిన బంతి లైన్‌‌ను తప్పుగా అంచనా వేశాడు. దీంతో  లెగ్‌‌ స్టంప్‌‌ గాల్లోకి లేచింది. చేతన్‌‌ శర్మ హ్యాట్రిక్‌‌ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. కెరీర్​లో సునీల్​ గావస్కర్​(103 నాటౌట్) చేసిన ఏకైక వన్డే సెంచరీ ఈ మ్మాచ్​లోనిదే.