రాజస్థాన్‌లోని రాజ్ సమంద్ జిల్లా నాథ్ద్వారా టౌన్లో నిర్మించిన 369 అడుగుల శివుడి విగ్రహాన్ని ఈ రోజు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించనున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారి బాపు సమక్షంలో దీనిని సీఎం ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా నేటి నుంచి నవంబరు 6 వరకు తొమ్మిది రోజుల పాటు పలు మతపరమైన, ఆధ్యాత్మిక, సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఉదయ్‌పూర్‌కు 45 కి.మీ. దూరంలోని ఓ కొండపై ఈ విగ్రహాన్ని తత్ పదమ్ సంస్థాన్ అనే సంస్థ నిర్మించింది. 3 వేల టన్నుల ఇనుము, 2.5 లక్షల టన్నుల కాంక్రీట్ ఉపయోగించి పదేళ్లలో దీన్ని నిర్మించారు. ప్రపంచంలోనే ఎత్తైన ఈ శివుడి విగ్రహం నేటి నుంచి భక్తులకు దర్శనమివ్వనుంది. 250 ఏళ్ల పాటు నిలిచేలా దీన్ని నిర్మించారు. 20 కిమీ దూరం నుండి ఇది కనిపిస్తు్ంది. 2012 ఆగస్టులో అప్పటికి సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా ఇప్పుడు ఆయనే ప్రారంభిస్తున్నారు.
