వడోదర: ఆల్‌రౌండ్ షోతో మెప్పించిన ఢిల్లీ క్యాపిటల్స్ విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌లో ఎలిమినేటర్‌కు క్వాలిఫై అయింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో డీసీ 5 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఫలితంగా 8 మ్యాచ్‌ల్లో నాలుగో విజయంతో 8 పాయింట్లు అందుకొని మూడో ప్లేస్‌తో ముందంజ వేసింది. డిఫెండింగ్ చాంప్ ముంబై (6), యూపీ (4) చివరి రెండు స్థానాలతో ఇంటిదారి పట్టాయి.
ఏకపక్షంగా సాగిన ఆఖరి లీగ్‌లో తొలుత యూపీ 20 ఓవర్లలో 122/8 రన్స్ మాత్రమే చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (0) గోల్డెన్ డకౌటవ్వగా.. దీప్తి శర్మ (24), సిమ్రన్ షేక్ (22)తో పాటు చివర్లో శిఖా పాండే (23 నాటౌట్) రాణించింది. డీసీ బౌలర్లలో మరిజేన్ కాప్ మూడు, చినెల్లీ లీ, శ్రీ చరణి చెరో రెండు వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం లారా వోల్‌వార్ట్ (36 బాల్స్‌లో 7 ఫోర్లతో 47), కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (18 బాల్స్‌లో 5 ఫోర్లతో 34 నాటౌట్) తో పాటు షెఫాలీ వర్మ (29) రాణించడంతో ఢిల్లీ 18.4 ఓవర్లలో126/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. కాప్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మంగళవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో ఢిల్లీ పోటీపడనుంది. ఇందులో గెలిచిన టీమ్ గురువారం ఆర్సీబీతో ఫైనల్లో తలపడనుంది.
