దర్వాజ కథ.. కచ్చురం : రావుల కిరణ్మయి

దర్వాజ కథ.. కచ్చురం : రావుల కిరణ్మయి

‘‘నాయనా ..! మంగళ్​రెడ్డి దొరోరు అమెరికా నుండి ఇన్నొద్దులకు ఊర్లడుగు వెట్టిండట. పల్లె మీదికి ముగ్గు వొయ్యవోతే ఎరికైంది. కుమ్మరి కుంభయ్య మామ చెప్పవట్టిండు. దొరోరు సూడచ్చినోళ్ళతోని కడుపునిండ మునుపటి లెక్కనే మాట్లాడుతాండట. కట్టం అన్నోళ్లకు తోచిన సాయం సుత జేత్తాండట”అని తండ్రితో చెప్పిండు నిర్గమయ్య.

‘‘ఒరేయ్ నిర్గమయ్య ...! నువ్వు సుత బిడ్డ లగ్గం వెట్టుకుంటే ఎల్లుబాటు ఎట్లని తండ్లాడవడితివి. నువ్వు గాదుగని, నాయన్ను తోలి ఏమన్న సాయం అడుగమనరాదు. ఇద్దరు ఎనుకటివట్టి మంచి దోస్తాన్లు గదా” అనుకచ్చిండు మావ. 

 

‘‘గందుకని..... రేప్పొద్దటికి ఓ మల్క నిమ్మలంగ వొయ్యత్తవా?’’ అని అసలు ఇసయం సావు కబురు సల్లగ జెప్పినట్టు జెప్పిండు నిర్గమయ్య, తన తండ్రి సద్గుణాచారికి.
డాకలి మీద గోండ్ల కత్తి సరుత్తున్న సద్గుణాచారి, ఎన్కాల తిత్తి గుంజుతున్న ఆయన భార్య శాంభమ్మ... కొడుకు చెప్పింది చెవులవడ్డా... వడనట్టే తమ పని కానిస్తుండడంతో నిర్గమాచారి మల్ల అన్నడు. ‘‘అవ్వా! ఏందే? ఎవ్వలు ఏం సప్పుడు జేత్తలేరు. నా ముచ్చట చెవిటోని ముందట శంఖం ఊదినట్టే ఉన్నది గదా’’ అన్నడు. దానిగ్గూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నరు ఇద్దరు. ఇంతట్లనే కత్తులు వట్టుకొని గౌండ్ల రాయమల్లు రాంగనే .... ఏమనలేక ‘‘మాపటికి మల్లత్తనే’’ అనుకుంట ఎల్లిపోతుంటే .. ‘‘ఏంది పిలగ? నన్ను జూడంగనే జారుకుంటాన్నవ్? మావ వచ్చిండని మర్యాదిచ్చుడు లేదా? మాపటికి ఇంటికచ్చినప్పుడు నేను జేత్తతీ మర్యాద కల్లుగుడాల తోని” అన్నడు పరాచికంగా సద్గుణాచారితో పాటు వారి సంతు ఎవరు కూడా కల్లు, మద్యం లాంటి పానీయాలు ముట్టరని తెలిసి.
‘‘మావా! నా మనసు మంచిగుంటలేదే! నువ్వు ఏమనుకోకు మల్ల కలుత్త” అని ఆగకుండ పోవడానికని సైకిలెక్కిండు. ఆయనటు పోంగనె రాయమల్లు అడిగిండు ‘‘ఏంది? బావా..! మీవోడు ఎట్నో వున్నడు. ఏందట కథ?” అని తను తెచ్చిన బొగ్గులు, కత్తులు బయిట వెట్టిండు. ‘‘సెల్లె! నేను గుంజుతగని నువు జరంత కూకో!” అని తిత్తి అందుకున్నడు. శాంభమ్మ బొగ్గులు ఏరి ఇంత సేపు సర్సిన నిల్లదొనల కత్తుల్ని బయిటికి తీసి ఎవలికి వాళ్ళయి అసొంట వెడుతంటే.. సద్గుణాచారి కొడుకు సెప్పిన ముచ్చట పొల్లువోకుండ జెప్పిండు.
‘‘అల్లుడు రాకుంటే అమాసాగుతదా? ఈడు జెప్పెదాంక నాకు తెలువదనుకుంటాండు. నాకు గా పొద్దే ఎరుకైంది. ఏమని పోవాలె? ఎనకట వీడు జేసిన కథకే గదా! దొరోరి తోని సావుదప్పి కన్ను లొట్టవోయినట్టు అయింది. నీకేమెరుకలే అప్పుడు నువ్వు ఈడ లేకుంటువి. గా ముచ్చట సుత ఇన్నంక జెప్పరాదు. మంగళ్​రెడ్డి దొరోరి సెల్లె లగ్గానికి సవారి కచ్చురంబెడ్తనని మాటముచ్చటప్పుడు ఒప్పుకున్నరు. గా బండి జెయ్యమని నాకు ఒప్పజెప్పిండు. నేను సుత ఒప్పుకొని కట్టె గిన దెచ్చుకున్న. ఉగాదయినంక దాతి పండుగనాడు మొదలు వెట్టాల్నని అనుకున్న. ఇంతలకే నిర్గమయ్య ఏ పరీచ్చలోనో పస్టచ్చినని ఎచ్చులకు వొయ్యిండు. వీడు తాగనోడయిన వాళ్లకు ఉద్దెర వెట్టి మరీ కుషీ జేసిండు.ఈ సంగతి నాకు దెల్వదాయె. రెండొద్దులైనంక బ్రాండి షాపు శీను తండ్రి పైసలని ఇంటిమీదికచ్చేదాంక ఈ సంగతి నాకు దెల్వదాయే! పైసలేమన్న పెంకాసులా? అడుగంగనే... అడిగినన్నియ్యనీకి. ఇజ్జతు పోతదని ఆ కట్టె అప్పజెప్పిన. మళ్ల కట్టేదేను పైసల్లేక గా సందులనే మా బీరకాయ పీసు సుట్టం ఒగాయన సచ్చివోతే ముట్టచ్చిందని ఆ ముచ్చట ముందటవెట్టి మాటదప్పినోన్నియిన. దొరోరు మాట గూడ నీటి మూటయింది. గాయన ‘నీకేగని ఇజ్జతు... నాకు లేదనుకుంటివా? కట్టె తెప్పియమని అడుగడానికి నీకు అభిమానం అడ్డమచ్చిందా? మింగమెతుకులేకున్న మీసాలకు సంపెంగ నూనె...’ అనుకుంట ఓ మాట జారిండు. గంతె పాలకుండలాంటి మా దోస్తానిల విషం సుక్క వడ్డట్టయింది. ఇగ నేను అటు మొకాన వోలె. ఆయన ఆనాడు ఊరిడిసినోడు మళ్ల గిప్పుడే వచ్చిండు. ఇప్పుడు లగ్గమని బిచ్చమడుక్కోను వోయినట్టు మళ్లెట్లవోను?” అని సెప్పి అంబటాళ్ళ అయితంటె కొలిమి మీదికెళ్ళి లేచిండు. 
‘‘సత్తె మేలే! ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టినట్టయితే గట్నే అనిపిస్తది. అండ్ల మీ ఇష్వబ్రామ్మన్లకు రవ్వంత ఎక్కువేనాయే. సరేతీ ... పొలగాడేదో కులకశిపి మూలకువడి తిండి ఎట్లని తండ్లాడుతుండేమో! ఇంకేదన్న దారి సూడు’’ అని కాసేపు మాట్లాడి కత్తులు వట్టుకొని ఎల్లిపోయిండు రాయమల్లు.
శాంభమ్మ ఇద్దరికి కంచంల అన్నం పట్టుకచ్చి తినుకుంట ‘‘దొరోరిని కల్సితె బాగుండు. మన కొలిమి తిత్తికి గా జమాన్ల వాళ్ల నాయన ఇచ్చిన ఎద్దు తోలే గదా! ఇయ్యాల అంతో ఇంతో కొలిమి పనికి ఆసరయితాంది. ఇన్నేండ్లు మీదికచ్చిన ఇంకా జరిగినదాన్నే తల్సుకుంట ఉండుడు పద్ధతి గాదు. ఆయన వడ్ల నర్సిమ్మచారి జీవిడ్సినంక కచ్చురం బండి జేసేటోల్లె లేకుంట అయితే నీకు కొద్దిల తెల్సునని నిన్ను వేరే కాడికి తోల్కపొయ్యి పనిల మెరికలు నేర్పించుకచ్చే గదా! కమ్మరి, వడ్రంగం రెండు జెయ్యంగనే అన్ని బాధ్యతల కెళ్ళి అవుతల వడితిమి. ఆ మేలన్న యాదికుంచుకొని సూసత్తే బాగుండు’’ అన్నది నిమ్మళంగ.
ఆ మాటలతో ఆలోచనల వడ్డడు సద్గుణాచారి. ‘‘అది సరేనే! మనకెంత అభిమానమో ఆయన కెరికే గదా. దానితోనే దూరంబెరిగే’’ అన్నది.
‘‘అవును ఆ సంగతే యాది మర్సిన. ఎనుకటి పావురంతో పొయ్యత్త’’ అన్నడు. శాంభమ్మ మనసుల మస్తు కుషీ అయ్యింది. కొడుకుతోని మాట రాకుండా ఇటు దొరోరి దగ్గర బెమానోల్లు అనే పేరు రాకుండ అయితున్నందుకు. కొడుక్కు సుత ‘నాయన పోతాడట’ అన్నదే తప్ప సాయమడుగుతడని చెప్పలే. 
మరునాడు ఇంట్ల కాసిన జామకాయలు తువ్వాల్ల ముల్లెగట్టుకొని సూడ వోయిండు. దొరోరు గా పొద్దెప్పుడో తాను చేసిచ్చిన పడక్కుర్చీలోనే కూసుండి పుర్సత్​గనే ఉన్నడు. సూడంగనే లేసొచ్చి గట్టిగ కావలిచ్చుకున్నడు. కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా ‘‘చారీ... బొందిల పానముండంగ నిన్ను జూత్తననుకోలేదయ్యా. నేను తొందరవడ్డనని మనసు పీకుతనే ఉన్నది” అని మొదలు వెట్టి ఎనుకటియన్నీ ముందటేసి మస్తు ముచ్చట్లు యాది జేసిండు. ‘‘ఇయ్యాల నా తోనే తినాల” అని చారి కుటుంబంల ఎవ్వరు నీసు ముట్టరని ఎరుకున్నోడు గాబట్టి ప్రత్యేకంగా అయిదారు రకాల వంటలు చేపిచ్చిండు. చారి గూడ ఆ పావురంల అన్ని మర్సిపోయి భారం దింపుకున్నడు. ఇగ ఇంటికి బ్యాలెల్లుతుంటే ఆయనే ‘‘మనుమరాలి లగ్గం జెయ్యవోతాన్రట గదా!’’ అన్నడు.
‘‘అవునయ్యా! మీరు రావాలె! ఎట్లన్న వీలుజేసుకొని’’ అన్నడు.
‘‘నువ్వు పిలువకున్నా వచ్చేంత ఆజాది నాకున్నది. నేనూ నా మనుమరాలి లగ్గం జేసిన ఆన్నే. గప్పుడే అనుకున్న నా మనుమరాలసొంటోళ్ళకు, నా ఎరుకల ఉన్నోళ్ళకు ఈ ఏడు లగ్గం అయ్యెటోళ్ళకు ఏదో నాకు తోచిన కాడికి ఇయ్యాల్నని అనుకున్న. గట్ల నీ మనుమరాలికి కూడా ఇస్త తీస్కపో!” అన్నడు.
‘‘అట్నే కానీయండి. మంచి రోజు సూసుకొని నా కొడుకు, కోడల్ని తోలిత్త’’ అని ఇల్లు చేరిండు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లైందని చారి దంపతులు అనుకున్నరు. నిర్గమయ్య కూడా ఏదో ఉడుత సాయం అనుకున్నడు.
ఆ రోజు సంక్రాంతి ముక్కనుమ. సామాను పండుగ చేయడానికి సామాన్లన్నీ శుబ్బరంగా కడిగి ఈశాన్యం మూలన కామాక్షమ్మ దేవత ముందు పెట్టిండు. వాటికి విబూది, జాజు, పసుపు, కుంకుమ, గంధం పూసి అలంకరించి, నైవేద్యం పెట్టి పూజించాడు. మూడో రోజున సామానంతా తీసి నిర్గమయ్య సాయం తీసుకొని వానలకు కూలిన దేవుడర్ర టేకు దూలం తీసుకొని కచ్చురం బండి తయారీ షురువు జేసిండు. మనుమరాలి లగ్గంకు కర్ర సామాను కొని ఓరవెట్టిండు. ఇప్పుడు ఇట్ల జేత్తాంటే కొడుకు, భార్య సప్పుడు జెయ్యలే. చక్రం, ఆకులు, బుడ్డి, సుట్టలు డోలుపు, సట్టం, నొగలు అన్నీ... గిట్ల కొలతెంబడి కొడుక్కు చెప్పి తానూ ఓ చెయ్యి ఏసుకుంట, మధ్యల మధ్యల ఇర్సు, కమ్మి గిన అక్కెరవడే ఇనుప సామాను శాంభమ్మ ఆసర తోని చేసుకుని రికామీ లేకుండ కిందా మీద వడి ఇరవయొద్దులల్ల ఓడ గొట్టిండు. వెదురు తడిక మ్యాదరి సదానందంతోని అల్లిచ్చిండు. చూడనీకి కళ్ళు తిప్పుకోనంత అందంగ తయారైన సవారి కచ్చురానికి శాంభమ్మ గుమ్మడికాయ దిష్టి తీసింది.
సద్గుణాచారి దాన్ని తీసుకొని దొరోరికి అప్పజెప్పిండు. దొరోరు పరేషాను గా బట్టిండు. ‘‘నేను నిన్ను అడిగినానయ్య చారీ? గింత తెల్వనీయకుంట గిప్పుడు జేసుకచ్చినవ్” అని మురిపెంగ చూసుకున్నడు.
‘‘మీకు గా పొద్దు ఇచ్చిన మాట గిప్పుడు దీర్చుకుంటాన్న. ఇగ మీరు ఏమనకున్రి. నా మనుమరాలు లగ్గానికి ఈ సవారి కచ్చురంలనే రావాలె మళ్ల” అన్నడు. దొరోరికి మాటలు రాలే తలూపిండు.


తరువాత ముందటికాలాన ఆ సవారి కచ్చురం దొరగారి తోటలో కట్టబడిన పెద్ద మంటపంల తన హుందాతనాన్ని సద్గుణాచారి పనితనాన్ని, ఆ ఇద్దరి అనుబంధాన్ని తరతరాలకు చాటుతూ సాక్ష్యమై నిలిచింది. ఎంతో ఆత్మాభిమానం గల్గి ముమ్మూర్తులా బ్రహ్మంగారిని పోలిన సద్గుణాచారి సాయం ఊరికే తీసుకోడని తెలిసి మనుమరాలి పేరున ఇచ్చిన కానుకకు ప్రతిఫలంగానూ, తను జీవిడ్సి పొయ్యేటాళ్ళకు ఒక్క పారన్న సవ్వారి కచ్చురం ఎక్కి తోటలో పెట్టుకోవాలనుకున్న దొరగారి కోరికను చెప్పనీయని ఆత్మాభిమానం గలిగిన ఆ ఇరువురి అంతరంగం మూడోవారికి తెలియకపోవడం కొసమెరుపు. అలా ఆ ఇద్దరూ ఆ ఊళ్లె సవారి కచ్చురం మీద మంచితనానికి మారుపేరై ఊరేగసాగారు. 

- రావుల కిరణ్మయి, ఫోన్​ : 82475 66615