డ్రా అయితే.. ఇద్దరూ విన్నర్లే

డ్రా అయితే.. ఇద్దరూ విన్నర్లే
  • డబ్ల్యూటీసీ ఫైనల్​ ప్లేయింగ్​కండిషన్స్​ రిలీజ్ చేసిన ఐసీసీ

దుబాయ్: వరల్డ్​టెస్ట్​చాంపియన్​షిప్(డబ్ల్యూటీసీ) మెగా​ ఫైనల్ విషయంలో ఉన్న అనుమానాలకు ఐసీసీ తెరదించింది.  సౌతాంప్టన్​ వేదికగా ఇండియా, న్యూజిలాండ్​ మధ్య జూన్​18–22 తేదీల్లో జరగనున్న  డబ్ల్యూటీసీ మెగా ఫైనల్​ ప్లేయింగ్​ కండిషన్స్​ను శుక్రవారం రిలీజ్​ చేసింది. మ్యాచ్​ డ్రా లేదా టై గా ముగిస్తే విజేత ఎవరు అనే ప్రశ్నకు బదులిచ్చింది. ఇరు జట్లను జాయింట్‌‌ విన్నర్స్‌‌గా ప్రకటిస్తామని పేర్కొంది. అంతేకాక రిజర్వ్​ డే అమలు అంశంపై కూడా ఐసీసీ క్లారిటీ ఇచ్చింది. జూన్​23వ తేదీని రిజర్వ్​ డేగా షెడ్యూల్​లో పేర్కొంది. అయితే, అవసరమైతేనే ఆరో రోజు ఆట ఆడిస్తామని స్పష్టంగా చెప్పింది. అయితే, 30 గంటల ఆటను ఐదు రోజుల్లో పూర్తి చేయలేని పక్షంలోనే రిజర్వ్​ డే ఉంటుందని ఐసీసీ వెల్లడించింది. రిజర్వ్​ డేలో ఆట ఉంటుందా లేదా అనే అంశంపై మ్యాచ్​ రిఫరీ తుది నిర్ణయం తీసుకుంటారని ఇంటర్నేషనల్​ బాడీ వెల్లడించింది. ‘ ఐదు రోజుల ఆటను పూర్తి చేయడానికే రిజర్వ్​ డే ను షెడ్యూల్​ చేశాం. ఆడాల్సిన గంటలను కోల్పోయి..వాటిని ఐదు రోజుల్లోపు పూర్తి చేయలేని పక్షంలోనే రిజర్వ్​ డేకు వెళ్తాం. అంటే, నాలుగో రోజు ఆటలో రెండు గంటల సేపు నష్టపోతే దాన్ని ఐదో రోజు పూర్తి చేస్తాం. చివరి రోజు అది సాధ్యం కాకపోతే రిజర్వ్​ డేన ఆడిస్తాం. అంతేకానీ విన్నర్​ ఎవరో తేలలేదని ఆరో రోజు ఆట కొనసాగించాం. మ్యాచ్​ను డ్రా గా ప్రకటిస్తాం. మెగా ఫైనల్​కు సంబంధించి ఒక రోజు ఆటలో కొన్ని గంటలు కోల్పోతే.. మ్యాచ్​ రిఫరీ ఆ సమాచారాన్ని ఇరుజట్లకు, మీడియాకు  ఏ రోజుకు ఆరోజు తెలియజేస్తారు. తర్వాతి రోజు ఆటలో దాన్ని సర్దుబాటు చేస్తారు. రిజర్వ్​ డేకు వెళ్తున్నామా లేదా అనే అంశాన్ని ఐదు రోజు ఆట చివరి గంటలో రిఫరీనే ప్రకటిస్తారు’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.  అంతేకాక ఈ మెగా ఫైనల్​కు గ్రేడ్–1 డ్యూక్​బాల్​ను ఉపయోగిస్తామని ప్రకటించింది. కాగా, టెస్ట్​ మ్యాచ్ ప్లేయింగ్​ కండిషన్స్​లో ఐసీసీ ఇటీవల కొన్ని మార్పులు చేసింది. ఆ కొత్త రూల్సే డబ్ల్యూటీసీ ఫైనల్లో అమలవుతాయని ఐసీసీ పేర్కొంది.

షార్ట్​ రన్స్​..

ఆన్​ఫీల్డ్​ అంపైర్లు ప్రకటించిన షార్ట్​ రన్స్​ నిర్ణయాలను థర్డ్​ అంపైర్​ ఆటోమెటిక్​గా రివ్యూ చేయవచ్చు. షార్ట్​ రన్ పై తన తుది నిర్ణయాన్ని తర్వాతి​ బాల్​ పడేలోపు థర్డ్​ అంపైర్​ ప్రకటించాల్సి ఉంటుంది.

ప్లేయర్​ రివ్యూస్​..

ఎల్బీడబ్ల్యూపై డిసెషిన్​ రివ్యూ సిస్టమ్​(డీఆర్​ఎస్)కు వెళ్లేలోపు..సదరు డెలివరీని సక్రమంగా ఆడే ప్రయత్నం జరిగిందా లేదా అనే అంశంపై ఔటైన బ్యాట్స్​మన్​ లేదా ఫీల్డింగ్​ జట్టు కెప్టెన్​.. ఆన్​ ఫీల్డ్ అంపైర్​తో డిస్కస్​ చేసుకోవచ్చు.

డీఆర్​ఎస్​ రివ్యూస్​..

ఎల్బీడబ్ల్యూ రివ్యూల విషయంలో.. అంపైర్​ కాల్​తో తేడా రాకుండా ఉండేందుకు వికెట్​ జోన్​ మార్జిన్​(ఎత్తు)ను స్టంప్స్​ పైవరకు  పెంచారు. దీంతో వికెట్​ జోన్​ ఎత్తు, వెడల్పు అన్ని వైపులా సమంగా ఉంటుంది.