వర్తక సంఘం షాపులకు బహిరంగ టెండర్లు వేయాలి..యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్

వర్తక సంఘం షాపులకు బహిరంగ టెండర్లు వేయాలి..యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొండపైన ఉన్న వర్తక సంఘాన్ని రద్దు చేసి, దాని పరిధిలోని 114 షాపులకు బహిరంగ వేలం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక యువకులు, సభ్యులు భారీ నిరసన ర్యాలీ, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 40 ఏండ్లుగా వర్తక సంఘం వ్యాపారులు రాజకీయ పలుకుబడితో అధికారులతో కుమ్మక్కై షాపులను రెన్యూవల్ చేసుకుంటూ భక్తులకు పూజాసామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.

బహిరంగ వేలంలో ఒక్కో షాపు ఏడాదికి రూ. 2.50 కోట్ల వరకు పలుకుతుంటే, వర్తక సంఘం వ్యాపారులు 114 షాపులకు కలిపి ఏడాదికి కేవలం రూ. 1.68 కోట్లు మాత్రమే చెల్లిస్తూ ఆలయ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారని మండిపడ్డారు. ఈ షాపులకు ఓపెన్ టెండర్లు నిర్వహిస్తే ఆలయానికి ఏడాదికి దాదాపు రూ. 30 కోట్ల ఆదాయం సమకూరుతుందని, సాధారణ టెండర్ల కాలపరిమితి ఏడాది మాత్రమే ఉన్నప్పుడు వర్తక సంఘానికి ఈ నిబంధన ఎందుకు వర్తింపజేయడం లేదని వారు ప్రశ్నించారు.

ఆలయ అధికారులు, వ్యాపారులు ఒక్కటై టెండర్లు వేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే బహిరంగ టెండర్లు నిర్వహించి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు కాటబత్తిని ఆంజనేయులు, పల్లపు బాలయ్య, బండ రామస్వామి, దేవపూజ అశోక్, గ్యాదపాక బాలనర్సయ్య, బుగ్గా ఆంజనేయులు, మాటూరి బాలయ్య, దండబోయిన వీరేశ్, బందారపు మల్లేశ్, కొన్నె సంజీవ, బండి అనిల్  తదితరులు పాల్గొన్నారు.