‘స్వయంభూ’ దర్వాజాలు సిద్ధం

‘స్వయంభూ’ దర్వాజాలు సిద్ధం
  • సుమారు 450 కిలోల ఇత్తడితో తయారీ
  • వాటిపై నవ నారసింహ విగ్రహాలు

యాదగిరికొండ వెలుగు: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులలో భాగంగా స్వయంభూ ఆలయం ప్రధాన దర్వాజాలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకించి తలుపులపై స్వామి వారి అవతారాలను చిత్రీకరించి డిజైన్లుగా మలుస్తున్నారు. దేవుడికి ప్రీతి పాత్రమైన కమలం పువ్వులు కూడా చెక్కారు. వీటిని ఆగమశాస్త్రం ప్రకారం చేస్తున్నట్లు తమిళనాడుకు చెందిన ఆర్.రవీంద్రన్ తెలిపారు. భారతేదశంలో ఎక్కడా లేని విధంగా నరసింహుని చరిత్ర తెలిపే వీటిపై నవనారసింహుల విగ్రాహాలతోపాటు, ఆరు హంసలు, శంఖు చక్రనామాలు,14 కమలం పువ్వులు పూర్తిగా ఇత్తడితో చేసినవి ఉంటాయన్నారు. నవనారసింహుల విగ్రహాలు ఒక్కోటి సుమారు 14 కిలోల బరువుంటుందన్నారు. మొత్తం ఇత్తడితో చేయడంతో దర్వాజా 450 కిలోలు ఉటుందన్నారు.

ఆకర్షణీయంగా సప్తగోపుర కలశాలు

సప్తగోపురాలపై ప్రతిష్ఠించే కలశాలు పూర్తిగా రాగితో  చాలా ఆకర్షణీయంగా తయారు చేశారు. ఈ 56 కలశాలను రెండు సప్త తల గోపురాలు, ఐదు పంచతల గోపురాల పై  భాగంలో ప్రతిష్టించనున్నారు. అదేవిధంగా స్వయంభూ ఆలయ మధ్య భాగంలో నిర్మించే  ధ్వజస్తభం రాగి తొడుగుకు మెరుగులు దిద్దారు. తొడుగుపై స్వామి వారి వివిధ రూపాలు ప్రతిబింబించనున్నాయి. దర్వాజా, కలశాల తయారీ కేంద్రాన్ని ఆదివారం యాదాద్రి ఆలయ ఈవో ఎన్.గీతారెడ్డి సందర్శించారు. తలపులు, కలశాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. అద్భుతంగా ఉన్నాయని అభినందించారు.