ఇయ్యాల యాదాద్రి ప్రారంభం

ఇయ్యాల యాదాద్రి ప్రారంభం
  • ఆరేండ్ల తర్వాత దర్శనం ఇవ్వనున్న స్వయంభూ లక్ష్మీ నారసింహుడు
  • ఉదయం 11:55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ
  • పాల్గొననున్న సీఎం దంపతులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు
  • మధ్యాహ్నం 3 గంటల తర్వాత భక్తులకు అనుమతి
  • ఏడోరోజు వైభవంగా అష్టోత్తర శతకలశాభిషేకం

యాదాద్రి, వెలుగు: ఆరేండ్ల తర్వాత యాదాద్రి లక్ష్మీ నారసింహుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. సోమవారం మహాకుంభ సంప్రోక్షణతో ఆలయం పున:ప్రారంభం కానుంది. ఆలయ పున:ప్రారంభంలో భాగంగా ఈ నెల 21 నుంచి పంచకుండాత్మక సుదర్శన యాగం నిర్వహిస్తున్నారు. సోమవారం ఏకాదశి శ్రవణ నక్షత్రయుక్త మిథున లగ్నంలో ఉదయం11.55 గంటలకు పుష్కరాంశ ముహూర్తంలో మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించే స్వామి వారి శోభాయాత్రలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం ప్రధాన ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. ఆ తర్వాత స్వర్ణ ధ్వజస్తంభ దర్శనంతోపాటు 12.30 వరకు స్వామి వారి గర్భాలయ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సామాన్య భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ప్రారంభోత్సవం కోసం ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. కరెంటు లైటింగ్ లో ఆలయం అద్భుతంగా వెలుగులీనుతోంది.
ఘనంగా పంచశయ్యాధివాసం
లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ ప్రారంభం కోసం బాలాలయంలో నిర్వహిస్తున్న పంచకుండాల సుదర్శన యాగం ఆదివారంతో ఏడో రోజుకు చేరుకుంది. దేవతామూర్తుల విగ్రహాలకు అష్టోత్తర శతకలశాభిషేకం, షోడశ కళాన్యాస హోమాలు, పంచశయ్యాధివాసం నిర్వహించారు. తర్వాత ముఖ మంటపంలో 
నిత్య లఘు పూర్ణాహుతి, సాయంత్రం 6 గంటలకు యాగశాలలో సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, చతుస్థానార్చనలు, మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలు జరిపారు. తర్వాత ప్రధానాలయంలో దేవతామూర్తుల విగ్రహాలకు 16 కలశాలతో షోడశ కళాన్యాస హోమాలు చేశారు. బింబమూర్తులకు(శిలామయ, లోహమయ) పంచశయ్యాధివాసం నిర్వహించారు. విగ్రహాలపై వస్త్రాలు, కంబళ్లు(గొంగళ్లు) ఆచ్ఛాదన చేశారు. తర్వాత దృష్టిదోషం తగలకుండా వేదపారాయణాలతో శయ్యాధివాసం నిర్వహించారు.
3 వేల మందితో భద్రత
యాదాద్రి ఆలయ పున:ప్రారంభానికి సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల​ చైర్మన్లు సహా అనేక మంది వీఐపీలు హాజరవుతున్నారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. రాచకొండ సీపీ మహేశ్​ భగవత్ ఆధ్వర్యంలో మూడు వేల మంది పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నారు. కాగా, సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల కోసం ప్రెసిడెన్షియల్ సూట్లలో బస ఏర్పాటు చేశారు. మంత్రులు, ఇతర వీఐపీల కోసం గుట్టలోని అన్ని సత్రాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. కొండపైకి సీఎం కాన్వాయ్ తప్ప ఇతర వాహనాలు రాకుండా నిషేధించారు. యాగశాల ప్రాంగణంలోకి వీఐపీలు తప్ప ఇతరులకు అనుమతి లేదు.
ఆరేండ్లుగా ఆలయ నిర్మాణం
యాదాద్రి ఆలయం పున:నిర్మాణ పనులు దాదాపు ఆరేండ్లు సాగాయి. నారసింహుడు కొలువైన గర్భాలయాన్ని రెండున్నర లక్షల టన్నుల కృష్ణశిలలతో నిర్మించారు. ఇందుకు 1,200 మంది శిల్పులు పనిచేశారు. 1,700 అడుగుల పొడవునా.. 80 నుంచి 100 అడుగుల ఎత్తుతో ప్రాకారాలను నిర్మించారు. 84 అడుగుల ఎత్తుతో ఏడు అంతస్తుల మహారాజగోపురం.. ఐదు, నాలుగు, మూడు, రెండు అంతస్తులతో మరో ఐదు గోపురాలను నిర్మించారు. ప్రాకారానికి బయట అష్టభుజ మండపాల్లో భక్తులు సేదదీరవచ్చు. కొండమీద విష్ణు పుష్కరిణి, కొండ కింద భక్తుల కోసం లక్ష్మీ పుష్కరిణి ఏర్పాటు అయ్యాయి.