
యాదగిరికొండ, వెలుగు: యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నర్సింహస్వామి కల్యా ణం సోమవారం రాత్రి కనులపండువగా జరిగింది. తుల లగ్నంలో లక్ష్మీనరసింహుడు అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేసే అపూర్వ ఘట్టాన్ని ఆలయ ప్రధానార్చకులు నల్లం తీగల్ లక్ష్మీనరసింహాచార్యు లు, కారంపూడి నర్సింహాచార్యుల ఆధ్వర్యంలో జరిపారు. కల్యాణం సందర్భంగా స్వామి అమ్మవారలను ప్రత్యేకంగా అలంకరించి గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగించారు. పారాయణీకులు పారాయణం చేస్తుండగా, పండితుల వేద మంత్రాల మధ్య కల్యాణ వేడుకను నిర్వహించారు.
వధూవరుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామిఅమ్మవారిని హనుమంత వాహనంపై ఊరేగించారు. ఈ కల్యాణ వేడుకల్లో కలెక్టర్ అనితారామచంద్రన్, ఈవో ఎన్.గీతారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కల్యాణ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా సంఖ్యలో హాజరయ్యారు.