యాదాద్రి: ముగిసిన ‘చేనేత సంఘం’ ఎన్నికలు...ఓవరాల్గా 95 శాతం పోలింగ్ 

యాదాద్రి: ముగిసిన ‘చేనేత సంఘం’ ఎన్నికలు...ఓవరాల్గా 95 శాతం పోలింగ్ 
  •     పుట్టపాకలో 88 శాతం..  కుంట్ల గూడెంలో 98.33 శాతం పోలింగ్​ 
  •     లిమిటెడ్ ఓట్లలో.. ఐదు నుంచి 34 వరకు చిత్తు

యాదాద్రి, వెలుగు :  చేనేత సంఘాల పోలింగ్​ ముగిసింది. కొన్ని సంఘాల ఫలితాలు వెలువడగా, మరికొన్నింటిలో లెక్కింపు కొనసాగుతోంది. యాదాద్రి జిల్లాలో 18 చేనేత సంఘాలకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. ఈ సంఘాలలో 85 ఓట్ల నుంచి 784 వరకూ ఉండగా, మొత్తంగా 5818 ఓట్లు ఉన్నాయి. కాగా ఈ ఎన్నికల్లో అత్యల్పంగా పుట్టుపాక సంఘాలో 88 శాతం పోలింగ్​ జరగగా, కుంట్ల గూడెం సంఘంలో 98.33 శాతం పోలింగ్​నమోదైంది. ఓవరాల్​గా 95 శాతం పోలింగ్​ జరిగిందని తెలుస్తోంది. 

ముగిసిన కౌంటింగ్..​ ఫలితాలు వెల్లడి

మధ్యాహ్నం మూడు గంటలకే పోలింగ్​ ముగిసింది. అయితే ప్రతీ ఓటరు 9 మంది డైరెక్టర్లకు ఓటు వేసినందున లెక్కింపు ఆలస్యం అవుతోంది. పోటీ చేసిన ప్రతీ అభ్యర్థి పేరు నోట్​ చేసుకుంటూ ఓట్లు లెక్కిస్తూ ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో నమోదు చేస్తున్నారు. దీంతో లెక్కింపు ఆలస్యం జరిగింది. రాత్రి పొద్దుపోయే వరకూ లెక్కింపు కొనసాగింది. ఆలస్యంగా పోచంపల్లి సంఘం ఫలితం వెలువడింది.  కాగా, కొన్ని సంఘాల్లో ఒక ప్యానల్​ నుంచి కొందరు, మరో ప్యానల్​ నుంచి మరికొందరు డైరెక్టర్లుగా గెలవడం గమనార్హం. 

చెల్లని ఓట్లు..

చేనేత సంఘాల్లో ఓట్లు లిమిటెడ్​గా ఉన్నా.. లెక్కింపులో చెల్లని ఓట్లు భారీగా వచ్చాయి. రూల్స్​ ప్రకారం ఎంత మంది పోటీ చేసినా వారిలో 9 మందికి డైరెక్టర్లకు ఓటు వేయాల్సి ఉంటుంది. 9 మందికి మించి ఓటు వేస్తే.. ఆ ఓటు చెల్లదు. అనేక మంది ఓటర్లు 9 మంది అభ్యర్థుల కంటే ఎక్కువ మందికి ఓటు వేశారు. దీంతో ఒక్కో సంఘంలో ఆరు ఓట్ల నుంచి 30కి పైగా ఓట్లు చిత్తు అయ్యాయి. నేలపట్ల సంఘంలో 172 ఓటర్లు ఉంటే 166 మంది ఓట్లు వేశారు. వీరిలో 6 ఓట్లు చెల్లలేదు. మోత్కూరు సంఘంలో 210 ఉంటే 202 పోలయ్యాయి. ఇందులో 17 ఓట్లు చెల్లలేదు. కొన్ని సంఘాల్లో  5 నుంచి 34 ఓట్ల వరకూ చిత్తయ్యాయి.