యాదగిరీశుడి బ్రహ్మోత్సవానికి వేళాయే..ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు యాదగిరిగుట్టలో ఉత్సవాలు

యాదగిరీశుడి బ్రహ్మోత్సవానికి వేళాయే..ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు యాదగిరిగుట్టలో ఉత్సవాలు
  • రూ.2 కోట్లతో భారీ ఏర్పాట్లు
  •  ప్రత్యేక బస్సులు, భక్తులకు సకల సౌకర్యాలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 18 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 11 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం స్వస్తివాచనంతో ఉత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టనున్నారు.

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో యాదగిరిగుట్ట పట్టణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. ప్రధాన రహదారుల వెంట స్వాగత తోరణాలు, ప్రత్యేక లైటింగ్, సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. కృష్ణశిలతో నిర్మితమైన ప్రధాన ఆలయానికి లేజర్ లైటింగ్, విద్యుత్ దీపాల అలంకరణతో ప్రత్యేక ఆకర్షణ తీసుకువచ్చారు. రకరకాల పూలతో ఆలయాన్ని ముస్తాబు చేశారు. ప్రధానాలయ ఈశాన్య దిశలో యాగశాల ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్​రెడ్డితో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. 

స్వస్తివాచనంతో ఉత్సవాలు షురూ..

ఈ నెల 18న స్వస్తివాచనంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు, 28న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. బుధవారం విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అంకురారోపణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 19న ధ్వజారోహణంతో సకల దేవతలను ఆహ్వానిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో నిత్యం జరిగే ఆర్జిత సేవలు, సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు తాత్కాలికంగా రద్దు చేశారు.

ముఖ్య ఘట్టాలు..

ఉత్సవాల్లో భాగంగా 24న ఎదుర్కోలు, 25న స్వామివారి తిరుకల్యాణం, 26న రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ముఖ్యంగా కల్యాణం రోజున రాత్రి వరకు బస్సులు అందుబాటులో ఉంచనున్నారు.

20 నుంచి అలంకార, వాహన సేవలు..

ఈ నెల 20 నుంచి స్వామివారి వివిధ అలంకార, వాహన సేవలు ప్రారంభమవుతాయి. మత్స్య, శేష, హంస, సింహ, అశ్వ, గజ, గరుడ వాహన సేవలతో పాటు ప్రత్యేక అలంకారాలు నిర్వహించనున్నారు. 25న రాత్రి గజవాహనంపై లక్ష్మీనరసింహుల కల్యాణం, 26న దివ్యవిమాన రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 27న మహాపూర్ణాహుతి, పుష్పయాగం, 28న డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.

రూ.2 కోట్ల బడ్జెట్..

బ్రహ్మోత్సవాల నిర్వహణకు దేవస్థానం రూ.2 కోట్ల బడ్జెట్‌‌ను కేటాయించింది. వాహన సేవలు, పల్లకీ సేవలు, యాగశాల ఏర్పాట్లు పూర్తి చేశారు. 20 నుంచి 26 వరకు జరిగే అలంకార సేవల్లో భక్తులు ప్రత్యేకంగా పాల్గొనే అవకాశం కల్పించారు. రూ.20 వేలతో ప్రత్యేక సేవల్లో పాల్గొని అంతరాలయ దర్శనం, ప్రసాదాలు పొందే వెసులుబాటు కల్పించారు.

కల్యాణ టికెట్​ రూ.3 వేలు..

బ్రహ్మోత్సవాల సందర్భంగా వీఐపీలు, సాధారణ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణ టికెట్లను రూ.3 వేలుగా నిర్ణయించి ఆన్‌‌లైన్, ఆఫ్‌‌లైన్‌‌లో అందుబాటులో ఉంచారు. ఉత్సవాల కాలంలో ప్రతిరోజూ సుమారు 2,500 మందికి అన్నప్రసాద వితరణ చేయనున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

బ్రహ్మోత్సవాలు సాఫీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. వీఐపీల ఎంతమంది వచ్చినా సామాన్యులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజూ 2500 మంది భక్తులకు అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేశాం.

– ఈవో భవానీ శంకర్-