యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి జయంతి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం స్వామి వారు శ్రీరాముడిగా దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామివారికి నిత్య పూజల అనంతరం అలంకార సేవ నిర్వహించారు. యాగశాలలో ద్వార తోరణ పూజ, మూర్తికుంభారాధన, చతుస్థానార్చన, లక్ష్మీనారసింహ సుదర్శన, గరుడ మూలమంత్ర హోమాలు, నిత్య పూర్ణాహుతి చేపట్టారు. సాయంత్రం నిత్య పూజల అనంతరం శ్రీరామావతార అలంకార సేవను నిర్వహించారు.
స్వామి వారు తిరువీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మరో వైపు పాతగుట్టలో జరుగుతున్న జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం ప్రాతఃఆరాధన, యాగశాలలో చతుస్థానార్చన, నృసింహ, సుదర్శన, గరుడ మూలమంత్ర హోమాలు, లక్షపుష్పార్చన, సాయంత్రం సాయమారాధన, చతుస్థానార్చన, మూలమంత్ర హోమాలు, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు.
మహానివేదనతో నేడు ముగింపు
యాదగిరిగుట్టలో జరుగుతున్న నారసింహుడి జయంతి ఉత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. చివరి రోజున ఉదయం ద్వారతోరణ మాషబలి, మహా పూర్ణాహుతి, ఏకోత్తర సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. సాయంత్రం వేదస్వస్తి, నృసింహ ఆవిర్భావం, మహానివేదనతో ఉత్సవాలకు పరిసమాప్తి పలకనున్నారు.

