యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. 30 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించగా... మొత్తం రూ.3,18,37,261లతో పాటు 179 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి వచ్చినట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు. అలాగే 502 అమెరికన్ డాలర్లు, 5 ఇంగ్లాండ్ పౌండ్లు, 130 కెనడా డాలర్లతో పాటు నేపాల్, ఆస్ట్రేలియా, ఖతార్, మలేషియా, సౌదీ, వియత్నాం, ఫిలిప్పైన్స్ వంటి దేశాల కరెన్సీ సైతం వచ్చినట్లు ఈవో తెలిపారు. మరోవైపు గురువారం నిత్యపూజలు, కైంకర్యాల ద్వారా రూ.25,32,113 ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు.
నర్సన్నను దర్శించుకున్న ‘భీమనకట్టే పీఠం’ పీఠాధిపతి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని కర్ణాటకలోని ‘భీమనకట్టే పీఠం’ పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థ స్వామీజీ గురువారం దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా... గర్భగుడిలో నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖ మంటపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. తర్వాత శివాలయంలో స్పటిక లింగానికి అభిషేకం చేశారు.
