యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో ఉన్న 114 షాపుల కాలపరిమితి మే 31తో ముగియగా, దేవాదాయ శాఖ వాటి గడువును జూన్ 30 వరకు పొడిగిస్తూ రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 50 ఏండ్లుగా దేవస్థానంలో కొనసాగుతున్న ఈ వర్తక సంఘాన్ని రద్దు చేసి, షాపులకు బహిరంగ టెండర్లు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గత ఆరు నెలలుగా యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, నిరసనలు జరుగుతున్నాయి.
మంత్రి, కమిషనర్‌తో పాటు కలెక్టర్‌కు కూడా పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారు. వర్తక సంఘం వ్యవహారంపై కొందరు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు తీర్పు వచ్చే వరకు గడువు పొడిగించినట్లు ఆలయ అధికారులు చెబుతుండగా, వర్తక సంఘం నాయకులు పైరవీలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం వల్లే దేవాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
