యాదవ కుర్మల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన కేటీఆర్, హరీష్

యాదవ కుర్మల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన కేటీఆర్, హరీష్

తెలంగాణ వచ్చిన తర్వాత గొల్ల కురుమల జీవితాల్లో వెలుగులు వచ్చాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మన్నెగూడలో నిర్వహించిన యాదవ కుర్మల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హరీష్ రావు, తలసానితో పాటు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కుల వృత్తులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కుల వృత్తులపై ఆధారపడే వారి గురించి ఆలోచించి.. రూ.11 వేల కోట్లతో ఏడాదికి రెండు విడతలుగా గొర్రెలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని కేంద్రమంత్రులే అభిప్రాయపడుతున్నారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రం అమలుచేస్తున్న పథకాలను కేంద్ర మంత్రులే ప్రశంసిస్తున్నారని అన్నారు. దొడ్డి కొమరయ్య జయంతి, సదరు పండుగను కూడా అధికారికంగా నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. 

ధర్మాన్ని నిలబెట్టండి: హరీష్ రావు 
గొల్ల కుర్మలది మాట తప్పని జాతి అని మంత్రి హరీష్ రావు అన్నారు. ధర్మాన్ని నెలబెట్టండి.. న్యాయాన్ని గెలిపించండి అంటూ గొల్ల కురుములకు ఆయన పిలుపునిచ్చారు. గొల్ల కుర్మల కోసం సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. పరిపాలనతో భాగస్వాములను చేయడంతో పాటు... అభివృద్ధిలోనూ అవకాశం ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి రాష్ట్ర కాంగ్రెస్, బిజెపి నాయకులకు కనిపిస్తలేవని ఆయన మండిపడ్డారు. సిలిండర్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వంపై హరీష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బాయిల కాడ మీటర్లు పెడతామంటూ రైతులను బెదిరిస్తూ పూటకో మాట మాట్లాడే వారికి తగిని బుద్ధి చెప్పాలని అన్నారు. 

కేసీఆర్ కు అండగా నిలవండి: తలసాని
దేశ చరిత్రలో యాదవుల గురించి ఆలోచించిన సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గొల్ల కుర్మలను గౌరవించి అడగకుండానే గొర్ల పథకం తీసుకొచ్చారని గుర్తు చేశారు. కొందరు దుర్మార్గుల కారణంగా నగదు బదిలీ ఆగిపోయిందని మునుగోడు ఎన్నిక పూర్తైనంక దాన్ని ఎవరూ ఆపలేరన్నారు. మన కోసం ఆలోచించే సీఎం కేసీఆర్ కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి తలసాని వెల్లడించారు.