యాదగిరిగుట్టలో సీఎం హెలికాప్టర్‌ ల్యాండింగ్‌‌లో గందరగోళం..యాగశాలకు బదులు,.. టెంపుల్ సిటీలో ల్యాండింగ్

యాదగిరిగుట్టలో సీఎం హెలికాప్టర్‌ ల్యాండింగ్‌‌లో గందరగోళం..యాగశాలకు బదులు,.. టెంపుల్ సిటీలో ల్యాండింగ్
  •     గుట్టకింద యాగశాలకు బదులుగా టెంపుల్‌‌ సిటీ హెలిప్యాడ్‌‌పై ల్యాండింగ్‌‌
  •     యాగశాల వద్దే కలెక్టర్‌‌, పోలీసులు, ప్రజాప్రతినిధులు
  •     టెంపుల్‌‌ సిటీ హెలిప్యాడ్‌‌ వద్ద కనిపించని భద్రత
  •     సీఎస్‌‌ సీరియస్‌‌, ఆర్‌‌అండ్‌‌బీ డిపార్ట్‌‌మెంట్‌‌కు నోటీసులు
  •     వాతావరణం సరిగా లేకే టెంపుల్‌‌ సిటీ హెలిప్యాడ్‌‌పై..
  •      ల్యాండింగ్‌‌ చేశానని పైలెట్‌‌ వివరణ?

యాదాద్రి, వెలుగు: యాదగిరిగుట్టలో వేదపాఠశాల శంకుస్థాపనకు సీఎం రేవంత్‌‌రెడ్డి వచ్చిన హెలికాప్టర్‌‌ ల్యాండింగ్‌‌ విషయంలో గందరగోళం ఏర్పడింది. హెలికాప్టర్‌‌ను యాగశాలలోని హెలీప్యాడ్‌‌ వద్ద ల్యాండ్‌‌ చేయాలని ముందుగా నిర్ణయించుకొని, అక్కడే పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎంకు స్వాగతం పలికేందుకు కలెక్టర్‌‌ సహా ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులంతా అక్కడే వేచి ఉన్నారు.

 కానీ గుట్టకు వచ్చిన హెలికాప్టర్‌‌ యాగశాలలో కాకుండా.. చివరి నిమిషంలో టెంపుల్‌‌ సిటీలోని హెలిప్యాడ్‌‌ వద్ద ల్యాండ్‌‌ అయింది. దీంతో అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ఆఫీసర్లు, పోలీసులు, నాయకులంతా గందరగోళానికి గురయ్యారు. కనీస తనిఖీలు, ఎలాంటి భద్రత లేని టెంపుల్‌‌ సిటీ హెలిప్యాడ్‌‌ వద్ద సీఎం హెలికాప్టర్‌‌ ల్యాండ్‌‌ కావడంతో అటు అధికారులు, ఇటు పోలీసులు టెన్షన్​పడ్డారు. 

మారిన షెడ్యూల్‌‌..

 ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌‌ ప్రకారం.. ఉదయం 8.30 గంటలకు యాదగిరిగుట్టలోని యాగశాల వద్ద  హెలిప్యాడ్‌‌పై సీఎం హెలికాప్టర్‌‌ ల్యాండ్‌‌ కావాలి. ఆ మేరకు ఎస్పీ అక్షాంక్ష్​యాదవ్‌‌  నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు. సీఎం భద్రతను పర్యవేక్షించే అడ్వాన్స్‌‌ సెక్యూరిటీ లైన్స్​(ఏఎస్‌‌ఎల్‌‌) సైతం యాగశాల హెలిప్యాడ్‌‌ వద్దే ఉంది. 

సీఎం యాగశాలలో ల్యాండ్‌‌ అయిన అనంతరం కొండపైకి చేరుకొని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలి. ఆ తర్వాతే రోడ్డు మార్గంలో టెంపుల్‌‌ సిటీకి వెళ్లి వేద పాఠశాలసహా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాలి.  కానీ హెలికాప్టర్‌‌ టెంపుల్‌‌ సిటీలో ల్యాండ్‌‌ కావడంతో టూర్‌‌ షెడ్యూల్‌‌ మొత్తం మారిపోయింది.  యాగశాల వద్ద సీఎం రేవంత్‌‌రెడ్డికి స్వాగతం పలికేందుకు  ఎదురుచూస్తున్న ఎంపీ చామల కిరణ్‌‌కుమార్‌‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కలెక్టర్‌‌ అనురాగ్‌‌ జయంతిసహా అధికారులంతా నివ్వెరపోయారు.  

టెంపుల్‌‌ సిటీ హెలీపాడ్‌‌ వద్ద ముగ్గురు, నలుగురు పోలీసులు మాత్రమే ఉన్నారు. ల్యాండ్‌‌ అయిన హెలికాప్టర్‌‌ నుంచి ముందుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, తర్వాత సీఎం రేవంత్‌‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ దిగడంతో అక్కడ ఉన్న పోలీసులు షాక్‌‌కు గురయ్యారు.  

బాధ్యులెవరు?

సీఎం ల్యాండ్‌‌ కావడానికి యాగశాలలోని హెలిప్యాడ్‌‌నే ఓకే చేస్తూ కలెక్టర్‌‌ అనురాగ్‌‌ జయంతి ఆర్డర్స్‌‌ ఇచ్చారు. అయితే, అధికారుల ఆర్డర్స్‌‌కు భిన్నంగా హెలికాప్టర్‌‌ టెంపుల్‌‌ సిటీలో ల్యాండ్‌‌ కావడానికి బాధ్యులు ఎవరు ? అనే విషయంపై చర్చ నడుస్తోంది. వేద పాఠశాల శంకుస్థాపన కోసం టెంపుల్‌‌ సిటీపై పెద్ద టెంట్‌‌ వేశారు. 

సీఎంకు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  హెలికాప్టర్‌‌ ల్యాండ్‌‌ అయ్యే సమయంలో గాలి ఎక్కువగా ఉన్నది. ఇలాంటి టైంలో ల్యాండ్​అయితే టెంట్లు, ఫ్లెక్సీలు ఎగిరిపడితే పెద్ద ప్రమాదం జరిగేదని తెలుస్తోంది.  

కాగా, ఈ వ్యవహారంపై సీఎస్‌‌ సీరియస్‌‌ అయినట్టు సమాచారం. యాదాద్రి కలెక్టర్‌‌ అనురాగ్‌‌ జయంతి సైతం ఆర్‌‌అండ్‌‌బీ డిపార్ట్‌‌మెంట్‌‌కు నోటీసు జారీ చేశారు. తమ నోటీసులో యాగశాల హెలిప్యాడ్‌‌ మాత్రమే ఉందని, టెంపుల్‌‌ సిటీపై ఉన్న హెలీప్యాడ్‌‌ లేదని ఆర్‌‌అండ్‌‌బీ ఆఫీసర్లు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. యాగశాల హెలిప్యాడ్‌‌ వద్ద వాతావరణం సరిగా లేనందున టెంపుల్‌‌ సిటీ హెలిప్యాడ్‌‌లో ల్యాండ్‌‌ చేశానని హెలికాప్టర్‌‌ పైలెట్‌‌ సీఎంవో ఆఫీసర్లకు వివరణ ఇచ్చినట్టు సమాచారం.