ప్రెస్టన్ సిటీ కొత్త మేయర్‌‌‌‌గా గుజరాత్​కు చెందిన యాకుబ్ పటేల్ బాధ్యతలు

ప్రెస్టన్ సిటీ కొత్త మేయర్‌‌‌‌గా గుజరాత్​కు చెందిన యాకుబ్ పటేల్ బాధ్యతలు

బాధ్యతలు చేపట్టిన యాకుబ్ పటేల్

లండన్: ఉత్తర ఇంగ్లాండ్‌‌‌‌లోని లాంక్షైర్ కౌంటీలో గల ప్రెస్టన్ సిటీ కొత్త మేయర్‌‌‌‌గా గుజరాత్​కు చెందిన యాకుబ్ పటేల్ బాధ్యతలు చేపట్టారు. గుజరాత్‌‌‌‌లోని భరూచ్ జిల్లాలో జన్మించిన పటేల్.. 1976లో బరోడా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. యూకే వెళ్లారు. 1995లో ప్రెస్టన్ సిటీలోని అవెన్‌‌‌‌హామ్ వార్డుకు లేబర్ పార్టీ నుంచి మొదటిసారి కౌన్సిలర్‌‌‌‌గా  ఎన్నికయ్యారు. ప్రెస్టన్ సిటీ కౌన్సిల్ చరిత్రలో ముస్లిం కౌన్సిలర్ కావడం అదే మొదటిసారి. ప్రస్తుతం 2023–-24 ఏడాదికి మేయర్‌‌‌‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

పటేల్‌‌‌‌కు ప్రెస్టన్ సిటీతో ప్రత్యేక అనుబంధం ఉంది. అతను ప్రెస్టన్ కార్పొరేషన్‌‌‌‌లో 1979 నుంచి పనిచేశారు. జూలై 2009లో పదవీ విరమణ చేసే ముందు రెవెన్యూ ఇన్‌‌‌‌స్పెక్టర్, ట్రాఫిక్ ఇన్‌‌‌‌స్పెక్టర్, అసిస్టెంట్ చీఫ్, చీఫ్ ఇన్‌‌‌‌స్పెక్టర్, ఆపరేషన్స్ మేనేజర్‌‌‌‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రెస్టన్ జమీయా మసీదు, ప్రెస్టన్ ముస్లిం బరియల్ సొసైటీకి కో-ఆప్టెడ్ మెంబర్‌‌‌‌గా పనిచేస్తున్నారు. పటేల్​ తండ్రి ఇండియాలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారుగా ఉండేవారు.