
బెంగళూరు: యష్ రాథోడ్ (286 బాల్స్‌లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 194) తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో హయ్యెస్ట్ స్కోరు చేయడంతో.. దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంట్రల్ జోన్ భారీ స్కోరు సాధించింది. సారాన్ష్ జైన్ (69) హాఫ్ సెంచరీతో రాణించడంతో.. 384/5 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం (సెప్టెంబర్ 13) మూడో రోజు ఆట కొనసాగించిన సెంట్రల్ తొలి ఇన్నింగ్స్‌లో 145.1 ఓవర్లలో 511 రన్స్ చేసింది.
దాంతో సెంట్రల్‌కు 362 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. ఆరంభం నుంచి నిలకడగా ఆడిన ఓవర్‌నైట్ బ్యాటర్ యష్.. సౌత్ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొన్నాడు. జైన్‌తో కలిసి ఆరో వికెట్‌కు 176 రన్స్ జత చేశాడు. దీపక్ చహర్ (37)తో ఏడో వికెట్‌కు 58 రన్స్ జోడించి ఔటయ్యాడు. నాలుగు బాల్స్ తేడాలో ఈ ఇద్దరు ఔట్‌కాగా, మరో నాలుగు ఓవర్లలోనే సెంట్రల్ ఇన్నింగ్స్ ముగిసింది.
కుమార్ కార్తికేయ (8), ఆదిత్య థాక్రే (1) ఫెయిలయ్యారు. గుర్జప్నీత్ సింగ్, అంకిత్ శర్మ చెరో నాలుగు వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్ ఆట ముగిసే టైమ్‌కు 33 ఓవర్లలో 129/2 స్కోరు చేసి పోరాడుతోంది. రవిచంద్రన్ స్మారన్ (37 బ్యాటింగ్), రికీ భుయ్ (26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తన్మయ్ అగర్వాల్ (26), మోహిత్ కాలే (38) ఓ మాదిరిగా ఆడారు. సారాన్ష్ జైన్, కుల్దీప్ జైన్ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం సౌత్ ఇంకా 233 రన్స్ దూరంలో ఉంది..