యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు

యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు

భారత జట్టులో అద్భుతంగా రాణిస్తున్న యంగ్ ప్లేయర్స్ యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నివేదికల ప్రకారం వీరిద్దరూ గ్రేడ్ 'సి' లో చేర్చబడతారని తెలుస్తుంది. అంటే సంవత్సరానికి వీరు సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా కోటి రూపాయలు అందుకోనున్నారు. 2023లో బీసీసీఐ నలుగురు ప్లేయర్లకు 'ఏ' ప్లస్ కేటగిరీ, 5గురు ప్లేయర్లకు 'ఏ ' కేటగిరి, ఆరుగురికి 'బి' కేటగిరి,11 మందికి 'సి' కేటగిరి జాబితాలను సిద్ధం చేసింది. ఏ ప్లస్ కేటగిరీ వారు ఏడాదికి 7 కోట్లు, 'ఏ 'కేటగిరి వారు 5 కోట్లు, 'బి' కేటగిరి వారు 3 కోట్లు, 'సి' కేటగిరి వారు కోటి రూపాయల చొప్పున లభిస్తాయి.   
    
2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ తర్వాత 2023 వెస్టిండీస్ పర్యటనలో జైస్వాల్ తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి టీ20, టెస్టు ఫార్మాట్‌లలో తన స్థానాన్ని పదిలపరుచుకుంటూ జట్టుకు నిలకడగా రాణిస్తున్నాడు. అన్ని ఫార్మాట్ లలో అవకాశాలు దక్కించుకుంటూ టీంఇండియాలో కీలక ప్లేయర్ గా మారుతున్నాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండో టీ20లో అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. విండీస్ టూర్ లో ఆడిన తొలి టెస్టులోనే భారీ సెంచరీ చేసిన జైస్వాల్ 2024 టీ20 వరల్డ్ కప్ కు రేస్ లో ఉన్నాడు.                

మరోవైపు, దూబే 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ లో రాణించి భారత జట్టులో స్థానం సంపాదించాడు. గతంలో ఈ ఆల్ రౌండర్ టీంఇండియాలో ఎంపికైనా నిలకడ లేకపోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే రీ ఎంట్రీలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కీలక ఆల్ రౌండర్ గా మారాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్ ల్లో హాఫ్ సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్ లో 3 వికెట్లు తీసుకున్నాడు. దూబే బౌలింగ్ లో మరింత మెరుగైతే 2024 T20 వరల్డ్ కప్ కు హార్దిక్ పాండ్యకు బ్యాకప్ గా సెలక్ట్ అయ్యే అవకాశముంది.