- రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం.. 22న రైతు భరోసా నిధులు విడుదల
- సాదాబైనామాలకు త్వరలోనే పరిష్కారం
- ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్
- రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు: ప్రముఖ జ్యోతిష్యులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి
హైదరాబాద్, వెలుగు: ఇది రైతు నామ సంవత్సరమని, రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతి, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరించారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్రంలో 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ. 20,616 కోట్ల మేర రుణమాఫీ చేసి వారు ఆత్మగౌరవంతో బతకడానికి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల ప్రకారం దేశంలో అతి తక్కువ రుణభారం కలిగిన రైతులున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండడం గర్వకారణమన్నారు.
ప్రతి ఎకరాకు రూ. 12 వేల చొప్పున రైతు భరోసా అందిస్తున్నామని, ఇప్పటికే తమ ప్రభుత్వం రైతుభరోసా కింద రూ.18 వేల కోట్లు అందజేసిందన్నారు. ఈ నెల 22 నుంచి రైతులందరికీ రైతు భరోసా అందించబోతున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్, పంటలకు గిట్టుబాటు ధర లాంటివి కల్పిస్తున్నట్లు చెప్పారు. మన పొలాల్లో సమృద్ధిగా పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో విలసిల్లుతుందన్నారు. తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి త్వరలోనే పరిష్కారం చూపుతామని సీఎం ప్రకటించారు.
ధరణి భూతాన్ని తరిమికొట్టామని, దాని స్థానంలో భూభారతి తెచ్చి అన్నదాతల సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని గట్టెక్కించడానికి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు బోనస్ కూడా ఇచ్చి ఆదుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
రాష్ట్రం పాడిపంటలతో విలసిల్లుతుంది: ప్రముఖ జ్యోతిష్యులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి
రాష్ట్రంలో ఈ సారి పుష్కలంగా వర్షాలు కురుస్తాయని, పాడి పంటలతో రైతులు విలసిల్లుతారని ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. ఈ పరాభవ నామ సంవత్సరం 384 రోజులతో 13 మాసాలతో విరాజిల్లుతుందని, అధర్ములకే పరాభావమని, ధర్మాత్ములకు ప్రాభవంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణ తల్లి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి ఏకచత్రాధిపతిగా రాజ్యాన్ని ఏలుతారని పేర్కొన్నారు.
‘ఈ ఏడాది ఆధిపత్యం పోరు ఉంటుంది.. అసంతృప్తి కలిగిన వారికి పరాభవం తప్పదు.. కుటుంబంలో గానీ, పరిపాలనలోగానీ సమష్టిగా కలిసి కట్టుగా పనిచేస్తేనే విజయం సాధిస్తారు.. దేశ పరిపాలనలో న్యాయస్థానాల జోక్యం అధికంగా ఉంటుంది..
ఈ సారి ఆర్థిక శాఖ చూసేవారికి కొంత ఇబ్బంది ఉంటుంది.. కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే పాలన బాగుంటుంది.. ఆరోగ్య శాఖలో ప్రక్షాళన ఉంటుంది.. ప్రజలకు మైరుగైన వైద్యం అందించడానికి మంత్రులందరూ ఐక్యంగా ఉంటారు..’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ఆలయాలకు చెందిన అర్చకులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు.
