రాష్ట్ర వ్యాప్తంగా జోరు వాన

రాష్ట్ర వ్యాప్తంగా జోరు వాన
  • రాష్ట్ర వ్యాప్తంగా జోరు వాన
  • అమీన్​పూర్​లో 12.4 సెంటీ మీటర్ల వర్షపాతం
  • కరీంనగర్​, వరంగల్​ సిటీల్లో  మునిగిన కాలనీలు సంగారెడ్డి, జగిత్యాలలో  భారీ వానలు 
  • జగిత్యాల ఆస్పత్రిలో పిల్లల వార్డులోకి చేరిన వరద  రాత్రంతా బాలింతల జాగారం 

వెలుగు, నెట్​వర్క్​: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పలు జిల్లాల్లో వాగులు, వంకలు పారుతున్నాయి. గడిచిన 24 గంటల్లో సంగారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా 11.5 సెంటీ మీటర్ల  నుంచి 20.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్​, వరంగల్​, కరీంనగర్​, మెదక్​, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో అత్యధికంగా 12.43 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. భారీ వర్షాల కారణంగా మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్​సిటీలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్​వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

వట్టివాగు ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత..

రెండు రోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 2.89 టీఎంసీల కెపాసిటీ ఉన్న వట్టివాగు ప్రాజెక్ట్ నిండిపోయింది. 150 క్యుసెక్కుల ఇన్​ఫ్లో ఉండగా, మూడో గేట్​ను మంగళవారం 0.20 మీటర్లు ఎత్తి పది క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు ఎడమ, కుడి కాలువ ద్వారా నీటిని వదులుతున్నందున రైతులు అలర్ట్​గా ఉండాలని ఆఫీసర్లు హెచ్చరించారు.

కరీంనగర్ సిటీలో నీట మునిగిన కాలనీలు..

చిన్నపాటి వర్షాలకే  కరీంనగర్​లో వరద కష్టాలు మొదలయ్యాయి. సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షానికి కరీంనగర్ సిటీ.. జ్యోతినగర్​లోని డ్రైనేజీలు పొంగి, పలు కాలనీల్లోకి వరద నీళ్లు చేరాయి. వానాకాలం వచ్చినా స్ట్రామ్ వాటర్ డ్రైయిన్లు పూర్తి కాకపోవడంతో వరద నీరు బయటకు వెళ్లడం లేదు. ఇక్కడ హనుమాన్​ టెంపుల్​లోకి నీళ్లు చేరగా, అంబేద్కర్​ స్టేడియం జలమయమైంది. 

పిల్లల వార్డులోకి నీళ్లు

జగిత్యాలలో సోమవారం అర్ధరాత్రి నుంచి పడ్తున్న వానలకు పట్టణం అతలాకుతలమైంది. డ్రైనేజీలు నిండి రోడ్ల మీద పారాయి. జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ (మాతా శిశు కేంద్రం)లోని చిల్డ్రన్స్ వార్డులోకి వరద నీరు చేరడంతో బాలింతలు ఇబ్బందులుపడ్డారు.  దీంతో రాత్రంతా పిల్లలతో జాగరణ చేశారు. నెల రోజుల క్రితమే ఈ హాస్పిటల్​ను  మంత్రి హరీశ్​రావు ప్రారంభించారు. నిర్మాణలోపం వల్లే ఎంసీహెచ్​లోకి వరద నీరు ప్రవేశించిందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో భారీ వర్షాలకు కరెంట్​సప్లై నిలిచిపోయింది. భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ఇండ్లలోకి నీళ్లు చేరడంతో.. ఆఫీసర్ల తీరుకు నిరసనగా ఆందోళన చేశారు.

ఇయ్యాల.. రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ శాఖ మంగళవారం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలం వెట్లూరుపల్లిలో 12.7 సెం.మీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్​లోని మఖ్దూంపూర్​లో 8.5 సెం.మీలు, జగిత్యాల జిల్లాలోని గోవిందపురంలో 6.2 సెం.మీ, కరీంనగర్​లోని వీణవంకలో 5 సెం.మీల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది.