రూ.700కి కాఫీ, రూ.100కి వాటర్ బాటిల్... మల్టీప్లెక్స్ ల రేట్ల పై సుప్రీంకోర్టు ఫైర్..

 రూ.700కి కాఫీ, రూ.100కి వాటర్ బాటిల్... మల్టీప్లెక్స్ ల రేట్ల పై సుప్రీంకోర్టు ఫైర్..

మల్టీప్లెక్స్‌లలో టిక్కెట్లు, పాప్ కార్న్,  కూల్ డ్రింక్స్ అధిక ధరలపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే సినిమా హాళ్లు ఖాళీగా మారుతాయని కోర్టు తెలిపింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహా ఇతరులు వేసిన పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్‌లు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని పరిశీలించింది. ఈ విషయం కర్ణాటక హైకోర్టు తీర్పు ప్రకారం టికెట్ల ధరలను రూ.200కి ఫిక్స్ చేయాలనీ చెప్పింది.

రూ.700కి కాఫీ : విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్.. మీరు వాటర్ బాటిల్‌కు రూ.100, కాఫీకి రూ.700 వసూలు చేస్తున్నారు అని అన్నారు. దీనికి మల్టీప్లెక్స్ అసోసియేషన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి స్పందిస్తూ తాజ్ హోటల్ కూడా రూ.1000కి కాఫీ అందిస్తుంది, అక్కడ ధర నిర్ణయిస్తారా ? అని ప్రశ్నించారు. దీనికి ప్రతిస్పందనగా జస్టిస్ విక్రమ్ నాథ్ అది వారి ఇష్టం.. సినిమా అనేది ఇప్పటికే క్షీణించింది, ధరలు తగ్గించకపోతే ప్రజలు రావడం కూడా మానేస్తారు అని అన్నారు. సినిమాను సమాజంలోని అన్ని వర్గాలు ఆస్వాదించేలా ఉండాలని... ధనవంతులకే పరిమితం కాకూడదని ఆయన అన్నారు.

 ప్రజలు మల్టీప్లెక్స్‌లకు వెళ్లకూడదనుకుంటే,  సాధారణ సినిమా హాళ్లకు వెళ్లాలి అని కూడా కోర్టు బదులిచ్చింది. టికెట్ ధరను రూ. 200గా నిర్ణయించడం సరైన దిశలో ఒక అడుగు అని, ప్రజలను తిరిగి థియేటర్లకు తీసుకువచ్చేలా ప్రోత్సహిస్తుందని కోర్టు పేర్కొంది.