సినిమాను మేమెంత ప్రేమించామో చూస్తారు: అడివి శేష్

సినిమాను మేమెంత ప్రేమించామో చూస్తారు: అడివి శేష్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘డెకాయిట్’. షానియోల్ డియో దర్శకుడు. సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రీ-రిలీజ్ వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో వెంకటేష్ మాట్లాడుతూ ‘కొన్ని చిత్రాలు మొదలైనప్పుడే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. 

సుప్రియ చాలా మంచి సినిమా తీస్తుందనే వైబ్ ఉండేది. ‘పంజా’ చిత్రంలో శేష్‌‌‌‌ని చూశా. అప్పుడే తను అద్భుతమైన నటుడు అవుతాడు అనిపించింది. ఆ తర్వాత తను చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఒక లవ్ స్టోరీలో ఇలాంటి యాక్షన్ ఉండటం చాలా కొత్తగా ఉంది. ఇంత కొత్త సబ్జెక్టుని సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పారు. 

హీరో అడివి శేష్ మాట్లాడుతూ ‘నా నుంచి సక్సెస్‌‌‌‌లతో పాటు ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌లు చూశారు. కానీ ఈ సినిమాలో మేము సినిమాని ఎంత ప్రేమించామో చూస్తారు. మేము ఒరిజినల్ గా ఒక ప్రేమ కథ అనుకున్నాం. కానీ ఈ రెండేళ్ల జర్నీలో అందరూ కూడా ఎంతో ప్రేమని అందించారు. ఏప్రిల్ 10న ఒక హానెస్ట్ సినిమాను, మా పాషన్‌‌‌‌ను చూస్తారు’ అని చెప్పాడు. ఇందులో పోషించిన సరస్వతి క్యారెక్టర్ తన కెరీర్​లో గుర్తుండిపోతుంది అని మృణాల్ చెప్పింది.

 తన తండ్రికి చెందిన యస్.యస్  క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌లో మరో మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ‘డెకాయిట్‌‌‌‌’ తీశాం అని నిర్మాత సుప్రియ యార్లగడ్డ చెప్పారు. అతిథులుగా హాజరైన హీరోలు సుమంత్, సిద్ధు జొన్నలగడ్డ, నిర్మాతలు సురేష్ బాబు, రవిశంకర్, దామోదర ప్రసాద్, నాగవంశీ, స్వప్నదత్, నాగ సుశీల, దర్శకులు రాహుల్ రవీంద్ర, కార్తిక్ ఘట్టమనేని, శౌర్యువ్, శశికిరణ్ తిక్క మూవీ టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.