V6 News

కూతురిని ప్రేమిస్తున్నాడని కొట్టి చంపింది

కూతురిని ప్రేమిస్తున్నాడని కొట్టి చంపింది
  • సంగారెడ్డి జిల్లా అమీన్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో అమ్మాయి తల్లి దారుణం 
  • తమ కుమార్తె వెంట పడొద్దని చెప్పినా వినకపోవడంతో యువకుడి హత్య 

అమీన్‌‌‌‌పూర్, వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో దారుణం జరిగింది. తన కూతురిని ప్రేమిస్తున్నాడని ఓ యువకుడిని ఆమె తల్లి కొట్టి చంపింది. ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన శ్రవణ్ సాయి (19) మేడ్చల్‌‌‌‌‌‌‌‌- మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడెంలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్‌‌‌‌‌‌‌‌ చదువుతున్నాడు. శ్రవణ్ సాయి, తన పదో తరగతి స్నేహితురాలు (19) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది.

 దీంతో తన కూతురు వెంట పడొద్దని శ్రవణ్ సాయిని ఆమె తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలో ఈ నెల 9న (మంగళవారం) అమీన్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లోని సృజన లక్ష్మినగర్ కాలనీలో ఉంటున్న ఆ అమ్మాయి ఇంటికి శ్రవణ్ ఉదయం 11 గంటల సమయంలో వచ్చాడు. అతన్ని చూసిన అమ్మాయి తల్లి, బంధువులు.. తమ ఇంటికి ఎందుకొచ్చావని ప్రశ్నించారు. కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపంలో ఉన్న అమ్మాయి తల్లి, బంధువులు అంతాకలిసి బ్యాట్‌‌‌‌ తీసుకొని శ్రవణ్‌‌‌‌పై దాడి చేశారు. 

అడ్డొచ్చిన కూతుర్ని కొట్టారు. ఈ క్రమంలో శ్రవణ్‌‌‌‌ తలకు, నడుముకు బలమైన దెబ్బలు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సాయంత్రం 5 గంటల సమయంలో కూతురికి అస్వస్థతగా ఉండడంతో ఆమె తల్లి, అన్నయ్య కలిసి బీరంగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన శ్రవణ్‌‌‌‌..​ అమ్మాయి ఇంట్లోనే రాత్రంతా అలాగే పడి ఉన్నాడు. తెల్లవారుజామున అతని పరిస్థితి సీరియస్‌‌‌‌గా ఉండడంతో నిజాంపేటలోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. శ్రవణ్ సాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.