సమాజంలో ఎక్కడ చూసినా కరప్షన్.. పొల్యూషనే! నోట్ రాసి ప్రాణం తీసుకున్న యువకుడు

సమాజంలో ఎక్కడ చూసినా కరప్షన్.. పొల్యూషనే! నోట్ రాసి ప్రాణం తీసుకున్న యువకుడు
  • నోట్ రాసి సూసైడ్ చేసుకున్న యువకుడు 
  • జీవితంపై విరక్తితోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖ  

గచ్చిబౌలి, వెలుగు: సమాజంలో ఎక్కడ చూసినా కరప్షన్, పొల్యూషనే ఉందంటూ జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమ్మా, నాన్నా.. క్షమించండి.. అంటూ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసి పెట్టాడు. హైదరాబాద్ మణికొండ శిరిడీ సాయి నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని మొరంపూడికి చెందిన గుట్టల సత్యనారాయణకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు దిలీప్ నాగేంద్ర తన భార్యతో కలిసి మణికొండ శిరిడి సాయి నగర్ లో నివాసం ఉంటున్నాడు. 

నాగేంద్ర తమ్ముడు గుట్టల వేణుగోపాల్(26) కూడా అన్నతోపాటే నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వేణుగోపాల్ ఈ నెల 23న తన అన్న, వదినతో కలిసి సొంతూరులోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. అదే రోజు వేణుగోపాల్ తిరిగి హైదరాబాద్ కు రాగా, అన్నా వదిన సొంతూరులోనే ఉన్నారు. 24వ తేదీన కుటుంబ సభ్యులతో వేణుగోపాల్ ఫోన్ లో మాట్లాడాడు. మరునాడు కుటుంబసభ్యులు ఎన్నిసార్లు కాల్ చేసినా వేణుగోపాల్ ఫోన్ స్విచాఫ్ వచ్చింది. 

దీంతో ఆ పక్క గదిలో ఉండే వాచ్ మాన్ సాయిబాబాకు ఫోన్ చేసి వేణుగోపాల్ ఇంట్లో ఉన్నాడో, లేదో చూడాలని అడిగారు. సాయిబాబా వెళ్లి చూడగా వేణుగోపాల్ సీలింగ్ ఫ్యాన్ కు బెడ్ షీట్ తో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. 

అమ్మా, నాన్నా.. క్షమించండి.. 

గదిలో వేణుగోపాల్ రాసి పెట్టిన సూసైడ్ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘నా ఆత్మహత్యకు ప్రేమ గానీ, ఇతరత్రా కారణాలుగానీ ఏమీ లేవు.. సమాజం అంతా ఎక్కడ చూసినా కరప్షన్, పొల్యూషన్ తో నిండిపోయిందని.. అందుకే జీవితంపై విరక్తి చెంది సూసైడ్ చేసుకుంటున్నాను. గతంలోనే ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నా.. అమ్మ, నాన్న నన్ను క్షమించండి..” అని నోట్ లో రాసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు.