
హైదరాబాద్ నగరంలో పోకిరీలు చేసే స్టంట్లు, ఓవరాక్షన్ గురించి తెలియని వాళ్లు ఉండరు. రూల్స్ పాటించకుండా, సైలెన్సర్లకు హోల్ చేసి పెద్ద పెద్ద సౌండ్స్, హారన్స్ తో కట్స్ కొడుతూ చిరాకు తెప్పిస్తుంటారు. ప్రశ్నిస్తే గొడవకు దిగటం.. దాడులు చేయటం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఆదివారం (జులై 13) రాత్రి ఉప్పల్ ఎక్స్ రోడ్డు దగ్గర మద్యం మత్తులో పోకిరీల వికృత చేష్టలతో హంగామా చేశారు.
ఆదివారం ఉప్పల్ X రోడ్డు వద్ద వాహనాల రద్దీ రోడ్డు బ్లాక్ అవ్వడంతో క్యాబ్ డ్రైవర్ హారన్ కొట్టాడు. దీంతో రెచ్చిపోయిన దుండగులు క్యాబ్ డ్రైవర్ పై గొడవకు దిగారు. వేలు చూపిస్తూ బూతులు తిడుతూ బెదిరించారు. డ్రైవర్ పై దాడికి ప్రయత్నిస్తుండగా కారులో ఉన్న ఐటీ ఉద్యోగులు వారించే ప్రయత్నం చేశారు. అంతే.. మాకే అడ్డుచెప్తారా అని కారు డోర్ తెరిచి, లోపల కూర్చున్న ఐటీ ఉద్యోగులపై దాడి చేశారు.
►ALSO READ | తిరుపతి రైల్వేస్టేషన్ లో రైలు బోగీలో మంటలు
పోకిరీల వికృత చేష్టలతో విసిగిపోయిన డ్రైవర్.. కారును స్టార్ట్ చేసి తన మానాన తాను వెళ్తుండగా స్కూటీపై కారును వెంబడించారు. ‘‘ఎక్కడున్నా నిన్ను వదలం..’’ అంటూ బెదిరించారు. దీంతో కారు డ్రైవర్ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించటంతో దుండగులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఉప్పల్ పోలీసులు.