తిరుపతి రైల్వేస్టేషన్ లో రైలు బోగీలో మంటలు

తిరుపతి రైల్వేస్టేషన్ లో  రైలు బోగీలో మంటలు

ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుపతి రైల్వేస్టేషన్ లో ప్రమాదం. ఆగి ఉన్న రైలు బోగీలో మంటలు వచ్చాయి. ఈ మంటలు చాలా ప్రాంతం వరకు కనిపించటం.. నల్లటి పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయటంతో ఏం జరుగుతుందో అనే భయం స్థానికుల్లో కనిపించింది. 2025, జూలై 14వ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో.. తిరుపతి రైల్వేస్టేషన్ లో ఈ ప్రమాదం జరిగింది. 

తిరుపతి హిసార్ ఎక్స్ ప్రెస్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రైలు బోగి పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ఫైర్ అధికారులు మంటలు వచ్చిన బోగీని  రైలు నుంచి వేరు చేయడంతో పెద్ద ప్రమాదం  తప్పింది. రైల్వే స్టేషన్ నుంచి గ్యారేజీని తీసుకెళ్తుండగా ప్రమాదం  జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైలు బోగీని వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. 

తిరుపతి రైల్వేస్టేషన్ లోనే.. లూప్ లైన్ లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులోని బోగీల్లో ఈ మంటలు వచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో ఎవరూ లేకపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన వెంటనే రైల్వే సిబ్బంది.. ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు వచ్చిన రైలు బోగీల పక్కనే.. మరో రెండు రైళ్లు ఆగి ఉండటం.. మంటలు ఆ రైలు బోగీలకు అంటుకుంటాయో అనే భయం అందరిలో నెలకొంది. అలాంటిది ఏమీ జరగకుండా మంటలు అదుపులోకి రావటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు కొద్ది సమయం బ్రేక్ పడింది. ప్రమాదానికి కారణాలు ఏంటీ.. ఆగి ఉన్న రైలు బోగీల్లో మంటలు ఎలా వచ్చాయి అనే విషయాలపై విచారణ చేస్తున్నారు రైల్వే అధికారులు.