నిండు కుండలా హిమాయత్ సాగర్.. సెల్ఫీలు, రీల్స్ కోసం యువత రిస్కీ స్టంట్స్..

నిండు కుండలా హిమాయత్ సాగర్.. సెల్ఫీలు, రీల్స్ కోసం యువత రిస్కీ స్టంట్స్..

తెలంగాణ వ్యాప్తంగా గురువారం ( సెప్టెంబర్ 11 ) నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మరోసారి నిండాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. వికారాబాద్, తాండూర్, మోమిన్పేట, మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా ఇన్ ఫ్లో పెరిగినట్లు తెలుస్తోంది. వరద ఉదృతి పెరగడంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1789.30 అడుగులు ఉన్నట్లు సమాచారం. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1763.15 కు చేరినట్లు సమాచారం.ఉస్మాన్ సాగర్ కు 1500 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. 2,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.హిమాయత్ సాగర్ కు 5000 క్యూసెక్యూల ఇన్ ఫ్లో వస్తుండగా.. 5,600 క్యూసెక్యూల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.

జంట జలాశయాల నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతుండటంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. ఇదిలా ఉండగా.. హిమాయత్ నిండుగా ఉన్న క్రమంలో చూసేందుకు భారీగా జనం తరలి వస్తున్నారు. కొంతమంది యువత సెల్ఫీలు, రీల్స్ కోసం రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో జంట జలాశయాల దగ్గర పోలీసుల భద్రత ఏర్పాటు చేయాలని.. సెల్ఫీలు, రీల్స్ కోసం రిస్క్ చేస్తున్న యువతను కట్టడి చేయాలని కోరుతున్నారు సందర్శకులు.