యూపీలో ఘోరం: మైనర్ బాలికపై యూట్యూబర్, ఎస్ఐ అత్యాచారం!

యూపీలో ఘోరం: మైనర్ బాలికపై యూట్యూబర్, ఎస్ఐ అత్యాచారం!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక మైనర్ బాలికపై జరిగిన దారుణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. రక్షణగా ఉండాల్సిన పోలీస్ అధికారి, ఒక యూట్యూబర్‌తో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు.

ఎం జరిగిందంటే: ఏడో తరగతితో  చదువు ఆపేసిన 14 ఏళ్ల బాలికను రాత్రి సమయంలో ఒక స్కార్పియో కారులో కిడ్నాప్ చేసి రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాదాపు రెండు గంటల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన ఆమెను ఇంటి ముందు వదిలేసి వెళ్ళిపోయారు.

 పోలీసులు ఈ కేసులో స్థానిక యూట్యూబర్ శివబరన్ యాదవ్, పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ అమిత్ కుమార్ మౌర్య ఇద్దరిని నిందితులుగా గుర్తించారు.  ఈ దారుణానికి వాడిన కారు సబ్-ఇన్‌స్పెక్టర్ మౌర్య పేరు మీద ఉండటంతో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మొదట ఈ కేసును పోలీసులు తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినట్లు, పోలీస్ అధికారి ప్రమేయం ఉందని తెలిసినా పట్టించుకోలేదని బాధిత కుటుంబం వాపోయింది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో కఠిన చర్యలు తీసుకున్నారు. 

కేసును సరిగ్గా దర్యాప్తు చేయనందుకు సచేండి SHO విక్రమ్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిప్యూటీ కమిషనర్ (DCP) దినేష్ చంద్ర త్రిపాఠిని బాధ్యతల నుండి తొలగించారు.

పరారీలో ఉన్న పోలీస్ అధికారి అమిత్ మౌర్య కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసుపై పూర్తి విచారణతో  దర్యాప్తు చేస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అలాగే దోషులపై పోక్సో (POCSO) చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.