సీఎం కేసీఆర్​ది గుండెనా.. బండనా అర్థం కావట్లేదు

సీఎం కేసీఆర్​ది గుండెనా.. బండనా అర్థం కావట్లేదు
  • నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ  రాష్ట్ర ప్రభుత్వ​ హత్యలే
  • నారాయణపేట నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల

నారాయణ పేట/ఊట్కూర్, వెలుగు: సీఎం కేసీఆర్​ది గుండెనా.. బండనా అర్థం కావట్లేదని, నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా ఆయనకు చీమ కుట్టినట్లయినా లేదని వైఎస్సార్​టీపీ చీఫ్  షర్మిల మండిపడ్డారు. మంగళవారం మక్తల్ సెగ్మెంట్ ఊట్కూర్ మండలం నిడుగుర్తిలో ఆమె నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో నిరుద్యోగం నాలుగు రెట్లు పెరిగిందని అన్నారు. కేసీఆర్ అనుకుంటే లక్షా 91 వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వొచ్చన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని ఆమె మండిపడ్డారు. నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ కేసీఆర్ చేసిన హత్యలేనని ఆరోపించారు. ఏండ్ల తరబడి జాప్యం చేసి ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారని, కాంపిటీషన్ భయంకరంగా ఉండేలా చేశారని అన్నారు. రాష్ట్రంలో ఎనిమిదేండ్లుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇయ్యలేదన్నారు. 90 వేల ఖాళీలుంటే ఇప్పటివరకు నోటిపికేషన్లు ఇచ్చింది 17 వేల ఉద్యోగాలకేనని, మిగతావాటికి ఎన్నడిస్తారని ప్రశ్నించారు.

కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు

కేసీఆర్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను అప్పుల పాలు చేస్తున్నారని, రైతు బంధు పేరుతో ఇచ్చే రూ.5 వేలు ఆ అప్పుల మిత్తీలకే సరిపోవట్లేదని అన్నారు. రైతులు కోటీశ్వరులయ్యారని చెప్తున్న సీఎంకు రైతు ఆత్మహత్యలు కనిపించట్లేదా అని ఆమె ప్రశ్నించారు. 8 ఏండ్లలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, కేసీఆర్ మోసం చేయని వర్గమే లేదని ఆరోపించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థను నాశనం పట్టించారన్నారు. రాష్ట్రంలో కనీసం హాస్టల్ పిల్లలకు సరైన భోజనం లేదని, యూనివర్సిటీల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, గుండెపోటుతో మరణించిన నిడుగుర్తికి చెందిన నిరుద్యోగి జి.శ్రీనివాస్(32) కుటుంబానికి రూ.25 వేల సాయాన్ని అందజేశారు.