ENG vs IND 2025: బర్మింగ్‌హామ్ టెస్ట్‌కు నితీష్ రెడ్డి.. కుల్దీప్‌కు గట్టి పోటీ ఇస్తున్న ఆల్ రౌండర్

ENG vs IND 2025: బర్మింగ్‌హామ్ టెస్ట్‌కు నితీష్ రెడ్డి.. కుల్దీప్‌కు గట్టి పోటీ ఇస్తున్న ఆల్ రౌండర్

తొలి టెస్ట్ ఓటమి తర్వాత టీమిండియాకు రెండో టెస్ట్ కీలకంగా మారింది. రేపు (జూలై 2) ఇంగ్లాండ్ తో బర్మింగ్‌హామ్ లో రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. మరోవైపు ఇప్పటివరకు బర్మింగ్ హామ్ లో విజయం లేని గిల్ సేన ఆతిధ్య జట్టుకు ఎలాగైనా షాక్ ఇవ్వాలని చూస్తుంది. మ్యాచ్ మధ్యాహ్నం 3:30 నిమిషాలకు జరుగుతుంది. ఇప్పటికే ఇంగ్లాండ్ రెండో టెస్ట్ కోసం ప్లేయింగ్ 11 ప్రకటించగా.. టీమిండియా ప్లేయింగ్ 11 పై ఆసక్తి నెలకొంది. రెండో టెస్టుకు టీమిండియా తుది ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.. 

నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్:

ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రెండో టెస్ట్ ప్లేయింగ్ 11 లో ఉండడం దాదాపుగా కన్ఫర్మ్ అయింది. అనుభవం ఉండడంతో తొలి టెస్టులో శార్దూల్ ఠాకూర్ కు టీమిండియా యాజమాన్యం అవకాశమిచ్చింది. ఈ ముంబై ఆల్ రౌండర్ మాత్రం రెండు విభాగాల్లో దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్ లో రెండు ఇన్నింగ్స్ ల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. ఇక బౌలింగ్ లో రెండే వికెట్లు పడగొట్టాడు. దీంతో రెండో టెస్టులో శార్దూల్ ను పక్కనపెట్టి నితీష్ కు అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తుంది. 

2024-25 ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ కుమార్ రెడ్డి తొలిసారి భారత టెస్ట్ జట్టులో స్థానం సంపాదించాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఒక సెంచరీతో సహా ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ 288 పరుగులు చేసి దుమ్ము లేపాడు. వీటిలో మెల్ బోర్న్ లో చేసిన సెంచరీ కూడా ఉంది. తొలి టెస్టులో భారత్ లోయర్ ఆర్డర్ లో తేలిపోయింది. దీంతో బ్యాటింగ్ దృష్ట్యా ఆలోచించి నితీష్ కు ఛాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ప్రాక్టీస్ లో కూడా ఈ తెలుగు ఆల్ రౌండర్ తీవ్రంగా చెమటోడ్చాడు. మరోవైపు శార్దూల్ ప్రాక్టీస్ కు దూరంగా ఉన్నాడు. 

కుల్దీప్ కు నో ఛాన్స్: 

వికెట్ స్పిన్‌‌కు అనుకులించే చాన్స్ ఉండటంతో తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉంటారని అసిస్టెంట్ కోచ్‌‌ టెన్ దష్కటె తెలిపాడు. జడేజాకు తోడుగా కుల్దీప్‌‌ యాదవ్‌‌, వాషింగ్టన్ సుందర్‌‌‌‌లో ఒకరు బరిలోకి దిగనున్నారు. నిన్నటివరకు కుల్దీప్ బరిలోకి దిగుతాడని భావించినా.. సుందర్ సడన్ గా రేస్ లోకి వచ్చాడు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగలగడం సుందర్ కు కలిసి రానుంది. ఇటీవలే సుందర్ టెస్ట్ ఫార్మాట్ లో టాప్ ఫామ్ లో ఉన్నాడు. దీంతో కుల్దీప్ కంటే సుందర్ వైపే జట్టు యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు మార్పులు ఖచ్చితంగా జరిగే అవకాశం కనిపిస్తుంది.