
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రేవంత్.. ప్రమాదం జరిగి 24 గంటలు అవుతున్నా ఇంత వరకు యాజమాన్యం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇంత వరకు బాధితులకు ఎలాంటి భరోసా ఎందుకివ్వలేదని ప్రశ్నించారు రేవంత్. నిర్లక్ష్యం వహించిన కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జూలై 1న ఉదయం మంత్రులతో కలిసి ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు రేవంత్ . సహాయక చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. కంపెనీ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై ఆరాదీశారు సీఎం రేవంత్. తక్షణ సాయం కింద మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరిక రూ.లక్ష, గాయాలైన వారికి రూ.50వేల ఆర్థిక సాయం ప్రకటించారు రేవంత్. సీఎం వెంట మెదక్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, పొంగులేటి, శ్రీదర్ బాబు, దామోదర రాజనర్సింహా ఉన్నారు.
ప్రమాదం స్థలంలోనే మంత్రులు, అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్.. కంపెనీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలో ఇలాంటి ప్రమాదాలు ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా?. ప్రమాదానికి గల అసలు కారణం ఏంటి? ఇలాంటి ఘటనలు మున్ముందు జరగకుండా అలర్ట్ గా ఉండాలి ,దీనిపై సమగ్ర నివేదిక రూపొందించండి. తనిఖీల్లో ఏమైనా లోపాలను గుర్తించారా?. పరిశ్రమను తనిఖీ చేశారా? ప్రమాదంపై నిపుణులతో అధ్యయనం చేయించి పూర్తి నివేదిక ఇవ్వాలి. ఇప్పటికే దర్యాప్తు చేసిన వారు కాకుండా కొత్త అధికారులతో విచారణ చేయాలి. ప్రమాదం జరిగి 24 గంటలు అవుతున్నా యజమాన్యం ఎందుకు రాలేదు..ఇంత వరకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. నిర్లక్ష్యం వహించిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ ఘటనను ప్రభుత్వం తీరియస్ గా తీసుకుంటుంది అని రేవంత్ అన్నారు.
జూన్ 30న ఉదయం జరిగిన ఘటనలో ఇప్పటి వరకు 42 మంది చనిపోయారు. ఇంకా 40 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.