హైదరాబాద్ చెంగిచెర్లలో దారుణం.. బిర్యానీలో నిద్ర గోలీలు కలిపి బాలికపై అత్యాచారం..

హైదరాబాద్ చెంగిచెర్లలో దారుణం.. బిర్యానీలో నిద్ర గోలీలు కలిపి బాలికపై  అత్యాచారం..
  • మెలకువ వచ్చాక మద్యం తాగించి మళ్లీ లైంగికదాడి 
  • అరిస్తే చంపేస్తామని కత్తితో బెదిరించిన ముగ్గురు నిందితులు  
  • 24 గంటలు నరకయాతన అనుభవించిన 8వ తరగతి విద్యార్థిని 
  • ప్రేమ పేరుతో నమ్మించిన మైనర్..​ తన ఇద్దరు ఫ్రెండ్స్​తో కలిసి అఘాయిత్యం 
  • నిందితుల్లో ఇద్దరు మైనర్లేనని వెల్లడించిన పోలీసులు

నార్సింగి, వెలుగు: హైదరాబాద్​లోని చెంగిచెర్లలో దారుణం జరిగింది. బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి 8వ తరగతి చదువుతున్న ఓ బాలిక(16)ను ముగ్గురు గ్యాంగ్ ​రేప్​ చేశారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 17) సాయంత్రం ఓ అపా ర్ట్​మెంట్​లోని డబుల్​ బెడ్​రూంకు తీసుకువెళ్లి బిర్యానీలో మత్తు మందు కలిపి ఒకరి తర్వాత మరొకరు లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక స్పృహలోకి వచ్చా క బలవంతంగా మద్యం తాగించి మళ్లీ రేప్​ చేశారు. 

తెల్లవారుజామున తాను వెళ్లిపోతానని వేడుకున్నా.. కనికరించకుండా చంపేస్తామని కత్తితో బెదిరించి కామవాంఛ తీర్చుకున్నారు. తనను ఎక్కడ చంపేస్తారేమోనని భయపడిన బాధితురాలు ఏమీ చేయలేక 24 గంటలపాటు నరకయాతన అనుభవించింది. స్కూల్​కు వెళ్లిన తన మనవరాలు ఇంటికి రాకపోవడంతో నార్సింగి పోలీసులకు అమ్మమ్మ కంప్లయింట్​ఇచ్చింది. దాంతో సెల్​ఫోన్ ​సిగ్నల్స్​ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. బాధితురాలిని దవాఖానకు తరలించారు. నిందితుల్లో ఒక మైనర్​ను మరో యువకుడిని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. మరో మైనర్​పరారీలో ఉన్నాడు. 

అమ్మమ్మే అన్నీ తానై..

సైబరాబాద్ పరిధి పుప్పాలగూడలో ఉంటున్న బాలిక తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోయారు. తల్లి వేరే పెండ్లి చేసుకుని వెళ్లిపోవడంతో అమ్మమ్మే అన్నీ తానై చూసుకుంటోంది. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న బాలిక.. ఈ నెల 7వ తేదీన షాపింగ్ కోసం చార్మినార్​కు వెళ్లింది. అక్కడ తలాబ్ కట్టకు చెందిన16 ఏండ్ల మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్‌లో మాట్లా డుకుంటున్నారు. ఈ నెల 16న బాలిక స్కూల్​కు వెళ్తున్నానని తన అమ్మమ్మకు చెప్పి బాలుడిని కలిసేందుకు మదీనాకు వెళ్లింది. ఇద్దరూ కలిసి చార్మినార్​తో పాటు మక్కామసీదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగారు. ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పడంతో తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని బాలిక అతడిని పూర్తిగా నమ్మింది. 

స్నేహితులను పిలిపించి..

16వ తేదీ సాయంత్రం వరకూ ఇద్దరూ కలిసే ఉన్నా రు. రాత్రి వేళ సదరు బాలుడు తన ఇద్దరు స్నేహితులకు ఫోన్​చేసి పిలిపించాడు. ఇందులో ఓల్డ్​సిటీకి చెందిన ఇమ్రాన్, మరో బాలుడు ఉన్నాడు. వారు ఆటో తీసుకుని వచ్చి బాలికను ఆటోలో కూర్చోబెట్టుకుని నలుగురూ తిరిగారు. తర్వాత డిన్నర్​ చేద్దామని చెంగిచెర్ల ప్రాంతంలోని డబుల్ బెడ్‌ రూమ్ ఇండ్ల వద్దకు తీసుకువెళ్లారు. అయితే, వెళ్తూ వెళ్తూ వెంట బిర్యానీ తీసుకువెళ్లారు. 

అందులో నిద్ర మాత్రలు కలిపి బాలికకు పెట్టారు. తిన్న తర్వాత స్పృహ కోల్పోవడంతో ఆమెపై లైంగికదాడికి పాల్ప డ్డారు.అర్ధరాత్రి వేళ మెలకువ రాగా బెదరించి మద్యం తాగించారు. మత్తులోకి వెళ్లాక మళ్లీ రేప్ చేశారు. తెల్లవారాక కూడా వదిలిపెట్టకుండా ఇమ్రాన్.. చంపేస్తానని కత్తి చూపి బెదిరించాడు. మళ్లీ ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు.  

స్కూల్​కు వెళ్లి తిరిగిరాలే..

స్కూల్​కు వెళ్తున్నానని చెప్పిన మనవరాలు సాయంత్రమైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో అమ్మమ్మ స్కూల్​లో , ఇతర చోట్లా వెతికింది. స్కూల్​కు రాలేదని తెలియడంతో బంధువులను వాకబు చేసింది. వాళ్లు కూడా రాలేదని చెప్పడంతో ఈ నెల17న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో బాలిక ఆచూకీని గుర్తించేందుకు స్పెషల్​ టీమ్స్​రంగంలోకి దిగాయి. అమ్మమ్మను వాకబు చేయగా తన మనవరాలు కొద్ది రోజులుగా తన ఫోన్​లో ఎవరితోనో మాట్లాడుతుందని చెప్పడంతో ఆ నంబర్​ను ట్రేస్​చేశారు. సిగ్నల్​ చెంగిచెర్లలో చూపించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. 

దర్యాప్తులో వారు ఒక అపార్ట్​మెంట్​లోని డబుల్ ​బెడ్​రూంలో ఉన్నట్టు తెలియడంతో అక్కడికి వెళ్లి నిందితులను పట్టుకున్నారు. బాలిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో హుటాహుటిన ఓ దవాఖానకు తరలించారు. ఇమ్రాన్​తో పాటు మరో మైనర్​ను పట్టుకున్నారు. మరొక మైనర్ ​పరారీలో ఉన్నాడు. పారిపోయిన నిందితుడిని పట్టుకోవడానికి సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఇమ్రాన్‌పై వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 8 కేసులు ఉన్నాయన్నారు. నిందితులపై పోక్సో, లైంగికదాడి, కిడ్నాప్, బెదిరింపు వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.