బెల్లంపల్లి, వెలుగు: విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం బెల్లంపల్లిలోని కేజీబీవీ క్యాంపస్లో చేపట్టిన భవన నిర్మాణ పనులను గురువారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ వసతి గృహాల్లో సకల సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఇందులో భాగంగా చేపట్టిన భవన నిర్మాణ పనులను స్పీడప్ చేసి త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతంలో చేపట్టిన ప్రైమరీ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులను సందర్శించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా విద్యార్థులకు ఒకే చోట సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఆయన వెంట సంబంధిత అధికారులు ఉన్నారు.
