బెంగళూరు: డొమెస్టిస్ క్రికెట్ రూల్స్‌లో బీసీసీఐ కీలక మార్పులు చేసింది. ఉద్దేశపూర్వకంగా నో బాల్ (ఫ్రంట్ ఫుట్) వేస్తే మ్యాచ్ నుంచి సస్పెండ్ చేయనున్నారు. గతంలో ఆ ఇన్నింగ్స్ వరకే సస్పెన్షన్ విధించేవారు. కానీ ఇటీవల మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రతిపాదించిన ఈ కొత్త రూల్స్‌ను బీసీసీఐ అన్ని రాష్ట్రాల క్రికెట్‌లో ప్రవేశపెట్టనుంది.
ఈ మేరకు సర్క్యులర్ ద్వారా ఆయా రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు తెలియజేసింది. కొత్త రూల్ ప్రకారం ఉద్దేశపూర్వక నోబాల్‌పై ఫీల్డ్ అంపైర్లు తక్షణమే నిర్ణయం తీసుకుంటారు. ఇక రోజు చివరి ఓవర్‌లో వికెట్ పడితే వెంటనే ఆటను ముగించే పాత పద్ధతికి గుడ్‌బై చెప్పారు. నిబంధన 12.5.2 సవరణ ప్రకారం, ఆ ఓవర్‌లోని మిగిలిన బంతులను కొత్త బ్యాటర్ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే.
మ్యాచ్‌లోని చివరి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం లేదా వదులుకోవడం (ఫోర్ ఫీచర్) కుదరదు. రెడిమేడ్ ఫలితాల కోసం ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నట్లు భావించిన ఎంసీసీ దీనిపై నిషేధం విధించింది. వన్డే మ్యాచ్‌ల్లో డ్రింక్స్ టైమ్‌లో హెడ్ కోచ్ గ్రౌండ్‌లోకి వెళ్లి ప్లేయర్లతో మాట్లాడటానికి అనుమతి ఇచ్చింది. బౌలర్ రన్‌అప్ ప్రారంభించిన సమయం నుంచి కీపింగ్ గ్లోవ్స్ స్టంప్స్ వెనుకే ఉండాలనే కఠిన నిబంధనను సవరించారు. ఇకపై బంతిని విసిరే క్షణంలో (ఎట్ ది టైమ్ ఆఫ్ డెలివరీ) గ్లోవ్స్ వెనుక ఉంటే సరిపోతుంది.
