మంత్రి హరీశ్ వ్యాఖ్యలపై షర్మిల మండిపాటు

మంత్రి హరీశ్ వ్యాఖ్యలపై షర్మిల మండిపాటు
  • దొంగల పాలనకు ముగింపు పలికే టైమ్ దగ్గర పడింది

హైదరాబాద్, వెలుగు: గోబెల్స్ ప్రచారానికి అసలైన వారసులు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్  మంత్రులే అని షర్మిల అన్నారు. తొమ్మిదేళ్లుగా అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై ట్విట్టర్​లో మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎన్నికల టైం దగ్గర పడడంతో కొత్త హమీలు ఇస్తున్నారని విమర్శించారు.

‘‘బంగారు తునక అని చెప్పి 4.50 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. అంత అప్పు చేసినా రుణమాఫీకి డబ్బు లేదు. డబుల్ బెడ్ రూంలకు డబ్బు లేదు. కొత్త పెన్షన్లకు డబ్బు లేదు. జీతాలు ఇవ్వడానికి కూడా దిక్కులేక ఆస్తులు అమ్ముతున్నారు. మీరు చేసిన అప్పులకు ఏడాదికి రూ.30 వేల కోట్ల మిత్తీలే కట్టాలి. దేశానికి తెలంగాణ దిక్సూచి అంటే రాష్ట్రాన్ని అమ్మేసి, అంధకారంలో నెట్టేయడమా?’’ అని ప్రశ్నించారు. నిరుద్యోగుల సంఖ్య50 లక్షలకు పెరగడం ప్రగతి అంటారా? అని నిలదీశారు. ‘‘తొమ్మిదేళ్లలో ముష్టి 65 వేల ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప విషయమా? ఒక్క గ్రూప్1 జాబ్  కూడా మీ (కేసీఆర్) పాలనలో ఇవ్వలేదు. రూ.లక్ష రుణమాఫీ అని చెప్పి 30 లక్షల మంది రైతులను మోసం చేశారు. 9 వేల మంది రైతుల ఆత్మహత్యలకు కారణం అయ్యారు. నిధులు మీకే, నీళ్లు మీకే, నియామకాలు మీకే. విద్యుత్ డిస్కంలను, ఆర్టీసీని నష్టాలపాలు చేశారు”  అని షర్మిల వ్యాఖ్యానించారు.

నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగులను, డబుల్  బెడ్ రూం ఇల్లు ఇస్తా అని ప్రజలను నిండా ముంచారని ఆమె ఫైరయ్యారు. తన అరాచకాలను ప్రశ్నించిన వారిని సీఎం అరెస్టు చేయిస్తున్నారని, గృహ నిర్భంధం చేయిస్తున్నారని మండిపడ్డారు. దొంగల పాలనను అంతం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.