బడ్జెట్‭ను వేస్ట్​ పేపర్‭లా చూస్తున్నరు: షర్మిల

బడ్జెట్‭ను వేస్ట్​ పేపర్‭లా చూస్తున్నరు: షర్మిల

హనుమకొండ/స్టేషన్​ ఘన్​ పూర్/ఐనవోలు, వెలుగు: రాష్ట్ర బడ్జెట్​ కొత్త సీసాలో పాత సారాలా ఉందని, కేటా యింపులకు, పెడుతున్న ఖర్చుకు పొంతనే లేదని వైఎస్సార్​టీపీ చీఫ్​ షర్మిల మండిపడ్డారు. ఆర్థిక మంత్రి హరీశ్​రావు న్యూఇయర్​ అని ఫామ్​హౌస్​కు కొత్త సీసా తీసుకెళ్తే.. కేసీఆర్​ అందులో పాత సారా పోశారని ఎద్దేవా చేశారు. బడ్జెట్​ను చూస్తుంటే కడుపు రగిలిపోతోందన్నారు. మంగళవారం స్టేషన్​ ఘన్​ పూర్​ నియోజకవర్గం వంగాలపల్లి, ధర్మపురం  నుంచి వర్ధన్నపేట నియోజకవర్గంలోని మల్లక్​ పల్లి, వనమాల కనపర్తి మీదుగా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి వరకు పాదయాత్ర చేశారు. యాత్ర 3,600 కిలోమీటర్లు దాటిన సందర్భంగా ధర్మపురం వద్ద వైఎస్సార్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం గర్మిళ్లపల్లి ప్రజలతో మాట-ముచ్చట నిర్వహించారు. వంగాలపల్లి వద్ద ప్రెస్​ మీట్​లో షర్మిల మాట్లాడారు.

ఎన్నికలుంటేనే కేసీఆర్​ బయటకొస్తరు

ఎన్నికలుంటేనే కేసీఆర్​ బయటకు వస్తాడని, ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయనే బయటకు వచ్చి మాయమాటలు చెప్తున్నారని షర్మిల మండిపడ్డారు. బంగారు తెలంగాణ చేస్తానని కేసీఆర్​ చెప్పారని, కానీ ఆయన కుటుంబమే బంగారమైందని విమర్శించారు. ‘‘ఇది బంగారు తెలం గాణ కాదు.. బార్ల తెలంగాణ.. బీర్ల తెలంగాణ.. అప్పుల తెలంగాణ.. ఆత్మహత్యల తెలంగాణ’’ అని అన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ పథకాలను మళ్లీ అద్భుతంగా అమలు చేస్తామని, ఇండ్లు లేని పేద కుటుంబాలకు మహిళల పేరునే ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 

రుణమాఫీ కోసం రైతుల ఎదురుచూపులు

గతేడాది బడ్జెట్ కేటాయింపుల్లో ఎంతమేర ఖర్చుపెట్టారో కేసీఆర్​ ప్రజలకు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్​ చేశారు. నిరుడు డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ.12వేల కోట్లు, దళిత బంధుకు రూ.17వేల కోట్లు పెట్టారని, కానీ ఖర్చు విషయంలో పొంతనే లేదన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ కోసం 36 లక్షల మంది ఎదురుచూస్తున్నారని, పూర్తి స్థాయి రుణమాఫీ కావాలంటే ఇంకా రూ.19 వేల కోట్లు అవసరమని కానీ రూ.6 వేల కోట్లతో ఎంత మందికి రుణమాఫీ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 2 లక్షల ఇండ్లు కడతామని చెప్పి, 25 వేల ఇండ్లు మాత్రమే గృహప్రవేశం చేశారని అన్నారు. బడ్జెట్​ను వేస్ట్​ పేపర్​లా చూస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో 33 ప్రాజెక్ట్ లు పెండింగ్

రూ.30 వేల కోట్లు ఖర్చుపెడితే 30 లక్షల ఆయకట్టు పెరు గుతుందని సీఎం అయిన తర్వాత కేసీఆర్​ చెప్పారని, ఎనిమిదేండ్లు అవుతున్నా ఆ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని షర్మిల ప్రశ్నించారు. దేవాదుల, కంతనపల్లి, డిండి, సీతారామ, నక్కలగండి తదితర 33 ప్రాజెక్టులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. కాళేశ్వరం రాష్ట్రానికి గుదిబండలా మారిందని, ఆ ప్రాజెక్టును ముందర వేసుకొని అన్ని ప్రాజెక్టులను పక్కన పెట్టారని మండిపడ్డారు. వైఎస్సార్ హయాంలో రూ.38 వేల కోట్లతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటే.. కేసీఆర్​ ఆ బడ్జెట్​ను మూడింతలు పెంచి రూ.లక్షా 20 వేల కోట్లతో కాళేశ్వరం కట్టారన్నారు. కానీ ఆ ప్రాజెక్టు మూడేండ్లకే మునిగిపోయిందన్నారు. 18 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పి 50 వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చారన్నారు. కాళేశ్వరానికి పెట్టిన ఖర్చులో ఒక వంతు పెట్టినా 33 ప్రాజెక్టులు పూర్తి అయ్యేవేవన్నారు.