వరి వేస్తే ఉరి అన్న సన్నాసి కేసీఆర్

వరి వేస్తే ఉరి అన్న సన్నాసి కేసీఆర్

వరి వేస్తే ఉరి అన్న సన్నాసి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇవాళ ఆమె జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలో షర్మిల ఈ రోజు అన్నారం సరస్వతీ బ్యారేజీని సందర్శించారు. అనంతరం మహదేవ్ పూర్ మండలంలోని కన్నెపల్లి పంప్ హౌస్ కు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పంప్ హౌజ్ కి వెళ్లనివ్వబోమని పోలీసులు చెప్పడంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు. 

కాళేశ్వరం ఎందుకు ఇలా కూలిపోతోంది ?  

వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ 18 ఏళ్ల క్రింద దేవాదుల ప్రాజెక్ట్ కట్టారు అది ఇప్పటి వరకు అది చెక్కు చెదరలేదు. ఆ ప్రాజెక్ట్ పటిష్టంగా నిలబడిందని షర్మిల గుర్తు చేశారు. మరి కాళేశ్వరం ఎందుకు ఇలా కూలిపోతుంది.. ఇది కేసీఆర్ చేతకాని తనానికి నిదర్శనం అని మండిపడ్డారు. మేఘా కృష్ణారెడ్డి ఒక్కడికే తెలంగాణలో ప్రాజెక్ట్ లు ఇస్తున్నారు. 80 శాతం మేఘా కృష్ణారెడ్డికే ఇచ్చారని తెలిపారు. మిషన్ భగీరథ, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, మన బడి పథకం కూడా ఆయనకే ఇచ్చారని విమర్శించారు. అంతేకాడు ఆర్టీసీని కూడా ఆయనకే ఇవ్వాలని  అనుకున్నారన్నారు. ఒక్క మేఘా కృష్ణారెడ్డికే ఎందుకు ఇస్తున్నారు అని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ కు మేఘా కృష్ణారెడ్డి ఇద్దరికీ ఇందులో సంబంధం ఉందని షర్మిల ఫైర్ అయ్యారు.

ప్రాజెక్ట్ కూలిపోతే ఎందుకు చర్యలు లేవు ? 

మీకు మీకు లావాదేవీలు ఉన్నాయని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోతే కృష్ణారెడ్డిపై ఎందుకు చర్యలు లేవని షర్మిల ప్రశ్నించారు. దేశంలో సంపన్నుల జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. మొత్తం అవకవతవకలు చేసి సంపాదించినదే అని ఆరోపించారుు. కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఇచ్చి కేసీఆర్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఒక్క మేఘా కృష్ణారెడ్డి బాగుపడితే సరి పోతుందా.. కేసీఆర్ ఎందుకు కృష్ణారెడ్డినీ ప్రమోట్ చేస్తున్నారని నిలదీశారు. 70 వేల కోట్లు అవినీతి చేశాడు అని.. 12 వేల కోట్లు జీఎస్టీ కట్టాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. మీరు మీరు పాట్నర్స్...అందుకే కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

కేసీఆర్ వాటాల కోసమే ఆయనకు కాంట్రాక్ట్ లు

మేఘా కృష్ణారెడ్డి కేసీఆర్ మనిషి అని.. కేసీఆర్ వాటాల కోసమే ఆయనకు కాంట్రాక్ట్ లు ఇస్తున్నారని షర్మిల మండిపడ్డారు. మేఘా కృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలి. ఆయన మీద ఒక సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 25 కోట్ల కంటే ఎక్కువ నష్టం జరగక పోతే ఎందుకు దాచి పెడుతున్నారు. ప్రతిపక్షాలు, మీడియా వెళ్తే మీ బండారం బయట పడుతుంది అని భయమా?.. మీరు చెప్తున్నది నిజం అని ఎలా విశ్వసించాలి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అబద్ధాల ప్రాజెక్ట్.. ప్రజలను మోసం చేసిన ప్రాజెక్ట్ అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్బుతం ఏమి కాదని.. ఇంత వరకు ఈ ప్రాజెక్ట్ సాధించింది ఏమీ లేదన్నారు. ఎత్తిపోసిన నీళ్ళు ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదని.. మొత్తం సముద్రంలోనే కలిపేస్తున్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.