బీఆర్ఎస్ అంటే భూములమ్మే రాష్ట్ర సమితి : షర్మిల

బీఆర్ఎస్ అంటే భూములమ్మే రాష్ట్ర సమితి : షర్మిల

మంత్రి కేటీఆర్ పై వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల  తీవ్ర విమర్శలు చేశారు. "ప్రభుత్వ భూముల వేలం పాటను ఆపివేయాలి. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకోవాలి"  అంటూ గతంలో కేటీఆర్ ప్లకార్డును ప్రదర్శించిన ఫోటోను ఆమె ట్వీట్ చేస్తూ  చెప్పేవి శ్రీరంగనీతులు..  చేసేవి పనికి మాలిన పనులు అంటూ  విమర్శలు గుప్పించారు.  భూములు అమ్మొద్దని ఉద్యమంలో చెప్పిన ఊకదంపుడు మాటలకు ..   స్వరాష్ట్రంలో సర్కారీ భూములపై చేస్తున్న దందాకు  పొంతనే లేదన్నారు.  

రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ పని కాకుంటే మీ 9 ఏళ్ల పాలనలో 38 వేల ఎకరాలు ఎందుకు అమ్మినట్లు అని ప్రశ్నించారు.  భూములకు వెతికి మరీ ఫర్ సేల్ బోర్డులు ఎందుకు పెడుతున్నట్లు? మరో 50 వేల ఎకరాలు అమ్మేందుకు ఎందుకు కసరత్తు చేస్తున్నట్లు? అని షర్మిల ప్రశ్నించారు.  

అప్పులు కమీషన్ల కింద..రాష్ట్ర ఆమ్దానీ విలాసాల కింద ఖర్చు పెడుతున్న రాబందులకు, భూములు అమ్మకపోతే పొద్దు గడవదని షర్మిల ఆరోపించారు.  అందుకే బీఆర్ఎస్ అంటే భూములమ్మే రాష్ట్ర సమితి..  సర్కారీ భూములు మింగేసే  భూ భకాసుర రాష్ట్ర సమితి అని విమర్శించారు.   భవిష్యత్ అవసరాలకు భూములు లేకుండా కొల్లగొట్టే బందిపోట్లకు బుద్ధి చెప్పకపోతే రేపు రాష్ట్రాన్ని సైతం వేలం వెయ్యక మానరని షర్మిల తన ట్వీట్ లో పేర్కొన్నారు.