
- ఆయన గుడిని, గుడిలో లింగాన్ని కూడా మింగేసే రకం: షర్మిల
- ఎమ్మెల్యే కాకముందు అప్పులు.. ఇప్పుడు వేల కోట్లు ఎక్కడివి?
వనపర్తి, వెలుగు: మంత్రి నిరంజన్‌రెడ్డి.. దేవుడి గుడిని, గుడిలో లింగాన్నీ మింగేసే రకమని, ప్రభుత్వ భూములు, ఆలయ మాన్యాలను కబ్జా చేశారని వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. చెరువుల పేరు చెప్పి వందల కోట్లు మింగేశారన్నారు. మంత్రి కాక ముందు అప్పుల్లో ఉన్న ఆయన.. ఇప్పుడు రూ.వేల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. పాలమూరు లిఫ్ట్ పూర్తి చేయకుండా రైతులను మోసగించారని ఆరోపించారు. ఇక్కడి రైతులకు కన్నీళ్లు మిగిల్చిన అసమర్థ మంత్రి అని విమర్శించారు. రాష్ట్ర మంత్రి అయ్యాక నిరంజన్పెద్ద దొర అయ్యారని, 150 ఎకరాలు కొని పెద్ద ఫాంహౌస్ కట్టుకున్నాడని విమర్శించారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో షర్మిల మంత్రి నిరంజన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మంత్రికి.. వీధికుక్కకి తేడా ఉందా?
మందు తాగే ముఖ్యమంత్రికి పెగ్గు పోసే మంత్రి నిరంజన్ రెడ్డి అని షర్మిల ఎద్దేవా చేశారు. సన్న రకం వడ్లు వేసుకోమని రైతులకు చెప్పి వారికి మద్దతు ధర కల్పించలేని సన్నాసి అని ధ్వజమెత్తారు. ఎరువుల కొరత వల్ల రైతులు క్యూలో నిలబడి చనిపోతే పరామార్శించేది పోయి.. సినిమా టికెట్ల కోసం నిలబడి చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారన్న వ్యక్తి నిరంజన్‌రెడ్డి అని దుయ్యబట్టారు. నిరుద్యోగులు నోటిఫికేషన్లు రాక ఉపాధి చూపమంటే హమాలీ పని చేసుకోవాలన్న ఘనుడని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల పక్షాన దీక్షలు చేస్తున్న తనను మంగళవారం మరదలు అంటూ సభ్యత లేకుండా మాట్లాడారని, ‘‘ఎవర్రా నీకు మరదలు, నీకు సిగ్గుండాలి’’ అని ఫైర్అయ్యారు. వీధి కుక్కకు మంత్రికి తేడా ఉందా? అని ప్రశ్నించారు.
ఎన్నికలు వస్తేనే కేసీఆర్ జనంలోకి వస్తరు
పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చే దిక్కులేదని, కనీసం రుణమాఫీ కూడా చేయడం లేదని షర్మిల విమర్శించారు. రేప్ లు చేయడంలో దక్షిణాదిలోనే తెలంగాణ నంబర్ 1 అని, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే అరికట్టలేని ముఖ్యమంత్రి ఉరి వేసుకుని చావాలని మండిపడ్డారు. ప్రజలను ఓట్లు గుద్దే మిషన్లుగా కేసీఆర్ చూస్తున్నారని, ఎన్నికలు వస్తేనే ఆయన జనం మధ్యకు వస్తారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ ఉద్దరించింది ఏమీ లేదని, కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్లోకి పోవడం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అలవాటుగా మారిందన్నారు. రేవంత్ ఒక దొంగ.. బ్లాక్ మెయిలర్ అని, ఆయన పిలక.. కేసీఆర్ చేతిలో ఉందని విమర్శించారు.