షర్మిల హౌజ్ అరెస్ట్.. ఇంట్లో కొనసాగుతున్న దీక్ష

షర్మిల హౌజ్ అరెస్ట్.. ఇంట్లో కొనసాగుతున్న దీక్ష

హైదరాబాద్: సైదాబాద్ సింగరేణికాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటన బాధిత కుటుంబాన్ని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం పరామర్శించారు. చిన్నారి తల్లిదండ్రుల బాధను చూసిన తర్వాత నిరాహారదీక్షకు కూర్చున్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించే వరకు నిరాహారదీక్ష చేస్తానని ఆమె ప్రకటించారు. చిన్నారి ఇంటి వద్దే షర్మిల దీక్షకు దిగారు. అయితే పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేయాలనే ఆలోచనతో గురువారం తెల్లవారుజామున 2 గంటల 20 నిమిషాల సమయంలో ఆమెను అరెస్ట్ చేశారు.  అనంతరం షర్మిలను లోటస్ పాండ్‎లోని ఆమె ఇంటికి తీసుకువెళ్లి హౌజ్ అరెస్ట్ చేశారు. 

అయితే షర్మిల మాత్రం తన దీక్షను ఇంటి వద్ద కూడా కొనసాగిస్తుంది. దీక్ష విరమించేది లేదంటూ ఆమె మొండి పట్టారు. సర్కార్ స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేసేవరకు దీక్ష విరమించేదిలేదని షర్మిళ అంటున్నారు. ఈ దారుణ ఘటనపై అధికార పక్షం ఎందుకు నోరుమెదపడం లేదని షర్మిళ ప్రశ్నించారు. కనీసం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా అధికార పక్షానికి లేదా అంటూ రాష్ట్ర సర్కార్‎ని షర్మిళ సూటిగా ప్రశ్నించింది.