మొదటి సంతకం ఉద్యోగాల భర్తీపైనే

మొదటి సంతకం ఉద్యోగాల భర్తీపైనే
  • మొదటి సంతకం ఉద్యోగాల భర్తీపైనే
  • ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తాం. 
  • ఆరోగ్య శ్రీ అమలు చేయడం జరుగుతుంది.
  • మూడు వేల పెన్షన్ లు ఇస్తాం.
  • తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడుతాం
  • విభజన హామీలను కేసీఆర్ మరిచిపోయారు
  • ఉద్యోగాల కల్పన మీద అసలు కేసీఆర్ కి ప్లానింగ్ లేదు
  • ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
  • నిరుద్యోగం తెలంగాణలో అత్యధికంగా పెరిగింది

తాము అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం పెట్టేది ఉద్యోగాల భర్తీపైనే అని, రాజశేఖర్ రెడ్డి పాలన మరోసారి ముందుకు తెస్తానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల హామీనిచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పారని, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని మాట మరిచారని విమర్శించారు. ఒక్క మాట నిలబెట్టుకోలేదని, ప్రతి వర్గాన్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో 87వ రోజు ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగింది. ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా.. లక్ష్మీపురంలో దీక్షకు దిగారు షర్మిల. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. టీఆర్ఎస్ కు ప్రజలు రెండు సార్లు అధికారం ఇస్తే ఏం చేశారని, ఏ బిడ్డలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం అత్యధికంగా పెరిగినట్లు చెప్పారు. ఉద్యమ సమయంలో గ్రూప్స్ పరీక్షలు రాయొద్దని చెప్పినట్లు.. ఎన్నిసార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారని నిలదీశారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు కూలి పనికి పోతున్నారని, కేజీ టూ పీజీ ఉచిత విద్య అని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. విద్యార్థులకు స్కాలర్ షిప్స్ లేవు... ఫీజు రీయంబర్స్ మెంట్ అమలు చేయడం లేదన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే... బిడ్డలను చదివించడం తప్పు చేశామని తల్లి దండ్రులు బాధ పడుతున్నారని వెల్లడించారు.

ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు :-
ఉద్యోగాలు రాకపోవడంతో  ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఒక్క రోజు కూడా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించలేదని పేర్కొన్నారు. దీనికంతటికీ కారణం కేసీఆర్ అని ఆరోపించారు. పార్టీ పెట్టకముందే నిరుద్యోగులకోసం మూడు రోజులు దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారామె. లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. 10, 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తారా అంటూ ఎద్దేవా చేశారు. లక్షా 91 వేల ఉద్యోగాలు కాకుండా...మొత్తం 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. 3 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ లో ఎన్ని సార్లు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు..? రాష్ట్రంలో ఒక్క కుటుంబానికి అండగా నిలిచారా ? అని ప్రశ్నించారు. వైఎస్ హాయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు ఉచితంగా వచ్చాయని.. ప్రస్తుతం ఇవన్నీ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. ఉద్యోగాలు వచ్చేంత వరకు పోరాటం చేస్తామని, తాము పోరాటం చేసిన అనంతరం ప్రభుత్వానికి బుద్ధి వచ్చిందన్నారు. అందుకనే ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఇస్తున్నారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని, మూడుసార్లు జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

87వ రోజు ప్రజా ప్రస్థానం యాత్ర :-
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో 87వ రోజు ప్రజాప్రస్థానం యాత్ర కొనసాగింది. YSRTP అధ్యక్షురాలు షర్మిల. వైరా  నైట్ క్యాంప్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ గండగుల మీదుగా.. లక్ష్మీపురం గామానికి చేరుకోన్నారు. అక్కడ నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. సాయంత్రం దీక్షను విరమించారు. లో నిరుద్యోగుల తరపున 26 వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు షర్మిల. ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలకు పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మీపురం గ్రామంలోనే రాత్రి బస చేయనున్నారు షర్మిల.