
ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్రం బార్లు, బీర్లతో, ఆత్మహత్యల తెలంగాణగా మారిందన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. సోమవారం ఖమ్మం జిల్లా, తిరుమలయపాలెం మండలం, కాకరవాయి సభలో మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ కాదని, బాధల తెలంగాణ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశారని, రెండుసార్లు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలకు ఆయన చేసిందేమిటని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు గారడి మాటలు తప్ప.. కేసీఆర్ తెలంగాణను ఉద్ధరించేదేమీలేదని.. మళ్ళీ కేసీఆర్ మాటలకు మోసపోవద్దని కోరారు. ప్రజలేసిన ఓట్లతో గెలిచి అధికారపార్టీకి పోయిన ఎమ్మెల్యేలను ఏమనాలన్నారు. ఇది రాజకీయ వ్యభిచారం కాదా?... తెలంగాణలో ప్రభుత్వానికి ప్రశ్నించే ప్రతిపక్షాలున్నాయా? అని ప్రశ్నించారు. మాటిస్తే మడమ తిప్పని వైయస్సార్ బిడ్డగా చెప్తున్నా.... మళ్లీ రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల ధీమా వ్యక్తం చేశారు.