- ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా దొంగ నాటకాలు ఆడుతున్నరు: బండి సంజయ్
- నాడు ఏపీకి హక్కులు రాసిచ్చింది కేసీఆర్ కాదా?
- ‘పాలమూరు’ వివరాలివ్వకుండా కేంద్రంపై ఏడుపేందని ఫైర్
హైదరాబాద్, వెలుగు: కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు.. ఇప్పుడు ఆ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ల విషయంలో ఒకరు చట్టం ద్వారా అన్యాయం చేస్తే.. మరొకరు ఒప్పందం ద్వారా మోసం చేశారన్నారు.
ఇప్పుడు ఇద్దరూ అసెంబ్లీలో దొంగ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. జాతీయ స్థాయిలో ‘అబద్ధాల పోటీలు’ పెడితే ఈ రెండు పార్టీలకే ఫస్ట్ ప్రైజ్‌లు వస్తాయని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. కేసీఆర్ తన హయాంలో తెలంగాణ హక్కులను ఏపీకి తాకట్టు పెట్టారని సంజయ్ ఆరోపించారు. ‘‘811 టీఎంసీల కృష్ణా జలాల్లో మనకు 555 టీఎంసీలు రావాల్సి ఉంది. కానీ, 299 టీఎంసీలు చాలు అని 2015లో సంతకం పెట్టింది కేసీఆర్ కాదా?’’ అని ప్రశ్నించారు.
ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే అపెక్స్ కౌన్సిల్ భేటీకి డుమ్మా కొట్టి, పరోక్షంగా సహకరించారని విమర్శించారు. కేసీఆర్ ఎనిమిదేండ్ల పాటు సుప్రీంకోర్టులో కాలయాపన చేయడం వల్లే కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు ఆలస్యమైందన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే ప్రాథమికంగా ద్రోహం చేసిందని సంజయ్ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ చేసిన ఆ తప్పును సరిదిద్ది, కృష్ణా బేసిన్ మొత్తాన్ని శాస్త్రీయంగా పంపిణీ చేసేలా కొత్త ట్రైబ్యునల్‌కు గెజిట్ ఇచ్చింది మోదీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోతే ఆ అవకాశం కూడా పోతుందని హెచ్చరించారు.
‘పాలమూరు’ ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం తిరస్కరించలే..
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం తిరస్కరించలేదని, సరైన వివరాలు లేనందున వెనక్కి మాత్రమే పంపిందని మరోసారి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ‘‘90 టీఎంసీల నీటిని ఎక్కడి నుంచి తెస్తారు? ఎలా వాడుతారు? అనే లెక్కలు చెప్పకుండా డీపీఆర్ పంపిస్తే ఎలా ఒప్పుకుంటారు? ఆనాడు కేసీఆర్ సర్కార్, ఇప్పుడు రేవంత్ సర్కార్ వివరాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. పైగా ప్రధాని పథకం కింద 60 శాతం నిధులు తెస్తామనడం హాస్యాస్పదం’’ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాజకీయాలు మాని, ప్రజలకు క్షమాపణ చెప్పి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.
