గురుకులాల్లో బిడ్డల ఉసురు తీస్తున్న సర్కారు

గురుకులాల్లో బిడ్డల ఉసురు తీస్తున్న సర్కారు

ప్రభుత్వ గురుకులాలు అంటేనే అణగారిన వర్గాల పిల్లలకు ఆశాదీపాలు.  కానీ,  గత  రెండేళ్లుగా విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కలుషిత ఆహారం, అపరిశుభ్ర వాతావరణం, సరైన వైద్యం అందకపోవడం, మానసిక ఒత్తిడి ఇలా కారణం ఏదైనా కావచ్చు. విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు.  ఈ మరణాలకు బాధ్యత ఎవరిది?  పేద విద్యార్థులకు భరోసా ఏదీ?  ప్రతి మరణం వెనుక ఒక విషాద గాథ,  పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అసలు  గురుకులాల్లో ఏం జరుగుతోంది?  భద్రతా ప్రమాణాలు ఎందుకు గాలికి వదిలేశారు? ఈ మరణాల పరంపరకు అడ్డుకట్ట ఎప్పుడు?  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గురుకులాలు,  సోషల్  వెల్ఫేర్  హాస్టల్స్,  ప్రభుత్వ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వ నిర్లక్ష్యం మరణశాసనం లిఖిస్తోంది.

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. రెండేళ్లలో 120 మంది 
విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోతే ఈ  ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకపోవటం అత్యంత విషాదకరం.  ఇంతకన్నా రేవంత్  సర్కార్  సిగ్గుపడాల్సిన విషయం మరొకటి ఉండదు.  ప్రభుత్వ విద్యను అభ్యసించే విద్యార్థుల పట్ల రేవంత్ సర్కార్ ఎందుకింత క్రూరంగా వ్యవహరిస్తోంది?  తెలంగాణ పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే ఈ  ముఖ్యమంత్రి  మనసు ఎందుకు కరగటం లేదు?  కాంగ్రెస్  ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన నాటి నుంచే   నిర్లక్ష్యం ప్రదర్శించటం  మొదలుపెట్టింది.  దాని  ఫలితంగా  ఇవ్వాళ 120 మందికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఈ విద్యార్థుల మరణాలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలే. 

విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రశ్నిస్తూనే ఉన్నా..
మొదటి నుంచీ  కూడా  ఫుడ్ పాయిజన్,  విద్యార్థుల ఆత్మహత్యలపై  నేను  ప్రశ్నిస్తూనే ఉన్నా.  కానీ, ఈ  ప్రభుత్వం మాత్రం పెడచెవిన పెట్టింది. మొదటి సంఘటన జరిగిన వెంటనే స్పందించి ఉంటే ఇవ్వాళ  ఇంతమంది విద్యార్థుల ప్రాణాలు పోకుండా ఉండేవి. ప్రభుత్వమంటేనే  మానవీయకోణంలో ఆలోచించాలి. దురదృష్టవశాత్తు రేవంత్ సర్కార్​కు ఆ సోయి లేకుండా పోయింది.

రేవంత్ సర్కార్  అధికారంలోకి  రావటం మొదలు  గురుకులాలు, ప్రభుత్వ,  వెల్ఫేర్ హాస్టళ్లలో  నిత్యం  ఏదో  ఓ సంఘటన జరుగుతూనే వచ్చింది.  విద్యార్థుల ఆత్మహత్యలు, పాముకాటుకు విద్యార్థుల మరణాలు,  ఫుడ్ పాయిజనింగ్​తో విద్యార్థులు తీవ్రంగా అస్వస్థతకు గురికావటం  నిత్యకృత్యంగా మారింది.  ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుంటే రేవంత్ సర్కార్ మాత్రం.. ఏమీ  పట్టన్నట్టుగా నటిస్తోంది.

ఇంకెన్నాళ్లు ఈ కడుపు కోత ?
తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోతుంటే ఒక తల్లిగా నా కడుపు తరుక్కుపోతోంది.  స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఇలా విద్యార్థులు చనిపోవటమన్నది నిజంగా తెలంగాణ సమాజమంతా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. ఉద్యమంలోనే 12 వందల మంది బిడ్డలను కోల్పోయిన తెలంగాణ తల్లికి ఇంకా ఎన్నాళ్లు ఈ కడుపు కోత?   తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలిగొనే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? తమ పిల్లలకు బంగారు భవిష్యత్ ఉంటుందని నమ్మిన తల్లిదండ్రులకు ఇంతటి కడుపుకోతను మిగిలిస్తే ఆ ఉసురు మీకు తగలకుండా పోదు.

కాంగ్రెస్​ అధికారం చేపట్టిన నాటి నుంచే నిర్లక్ష్యం
తెలంగాణ ఏర్పడేనాటికి 293 గురుకుల పాఠశాలలు మాత్రమే ఉంటే...ఆ తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో  కేసీఆర్  కొత్తగా 709 గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. పేద, మధ్య తరగతి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేసీఆర్  చిత్తశుద్ధితో  చేసిన ప్రయత్నం కారణంగా వేలాది మంది విద్యార్థుల  జీవితాలు వెలుగులతో నిండాయి.  కేసీఆర్  ప్రభుత్వం చేపట్టిన ఈ మంచి కార్యక్రమాన్ని తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాల్సి ఉండే. 

కానీ,  కేసీఆర్ మీద  కోపంతో  పేద, మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర చేస్తుండు ఈ ముఖ్యమంత్రి.  అధికారంలోకి వచ్చిన కొత్తలోనే  గురుకులాల మీద విషం కక్కిండు రేవంత్ రెడ్డి.  గురుకులాలు  కులాలను ప్రోత్సహించే విధంగా ఉన్నాయంటూ వాటిని నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టిండు.  తల్లిదండ్రులకు  తమ పిల్లలను ప్రభుత్వ హాస్టళ్లలో చదవించాలంటే భయపడే పరిస్థితి తెచ్చిండు. పరోక్షంగా ఎస్సీ,  ఎస్టీ,  బీసీ, మైనార్టీ విద్యార్థులను  చదువుకు  దూరం చేసే కుట్రల యత్నం చేస్తుండు.

విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన తప్పేంటి?
చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను ఒక్కసారి కలిస్తే వారి బాధ ఈ సీఎంకి తెలుస్తోంది. ఎంతో టాలెంట్ ఉన్న విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందటం, ఆత్మహత్యలు చేసుకోవటం  కలిచివేసింది. చిన్న వయసులోనే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటానికి  కారణమేంటో కూడా తెలుసుకోరా?  ఈ ప్రభుత్వం. విద్యార్థులు మానసికంగా కుంగిపోకుండా, ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకోకుండా కౌన్సిలర్లను పెట్టాల్సి ఉన్నప్పటికీ దానిమీద శ్రద్ధ పెట్టలేదు. 

ఎన్నోసార్లు ఈ అంశంపై  డీజీపీ, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని దృష్టి పెట్టాలని నేను స్వయంగా కోరాను. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.  భవిష్యత్​లో ఉన్నత స్థానానికి చేరి తమను బాగా చూసుకుంటారని ఆశపడ్డ తల్లిదండ్రులు  పుట్టెడు దు:ఖంలో  మునిగిపోయారు. ఆ పిల్లలు, వారి తల్లిదండ్రులు చేసిన తప్పేంటి? ఈ ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లో చదివించటమేనా?  సీఎం,  మంత్రుల  పిల్లలకు ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఇంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా?

జాగృతి తరఫున ఉద్యమం
పాముకాట్లు, ఎలుకలు కొరకటం, ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్​తో  విద్యార్థులు చనిపోవటం అంటే నిజంగా మనం ఇంకా ఎక్కడ ఉన్నాం?  విద్యార్థులకు సరైన భోజనం, భద్రత, వారి ప్రాణాలు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నామా?  అంత  చేతగాని ప్రభుత్వం ఉంటే ఏంటీ?  లేకపోతే ఏంటీ?  అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తాడన్నట్లుగా ఉంది ఈ ప్రభుత్వ వైఖరి.  ఓ పక్క 
గురుకులాలు, ప్రభుత్వ, వెల్ఫేర్ హాస్టళ్లలో  సరైన భోజనం, సౌకర్యాలు కల్పించలేని ఈ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కూల్స్ ప్రారంభిస్తుందంట. 

రాష్ట్రవ్యాప్తంగా 105 యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం  కోసం  రూ. 21 వేల కోట్లు ఖర్చు చేస్తుందంట.  నవ్విపోదురుగాక నాకేటీ సిగ్గు అన్నట్లు సీఎం  వ్యవహరిస్తున్నాడు. ముందు మరొక్క ఫుడ్ పాయిజన్ సంఘటన, విద్యార్థుల ఆత్మహత్యలు లేకుండా చేస్తే అదే  పదివేలు.  లేదంటే  జాగృతి తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.

విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రే
విద్యా శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రే కావటం మరింత శాపంగా మారింది. ఆయనకు విద్యాశాఖలో సమస్యలు తెలియవు. విద్యార్థులు చనిపోతుంటే  ఏం జరుగుతుందో  రివ్యూ చేసే తీరిక కూడా లేదు. నిజానికి ఇంతమంది విద్యార్థులు  చనిపోతే దేశంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా సరే యుద్ధప్రాతిపదికన ఇదే సమస్యపై ఫోకస్ పెడుతోంది. కానీ, మన రాష్ట్రంలో అటు అధికార పక్షంగాని, ప్రతిపక్షంగాని ఇంతటి  పెద్ద సమస్యను  వదిలి రాజకీయాలు చేయటంపైనే  ఫోకస్  చేస్తున్నాయి.  ముఖ్యమంత్రి,  ప్రభుత్వం దిగివచ్చే దాకా పోరాటం చేయాల్సిన ప్రతిపక్షం...పరామర్శలు,  ప్రెస్ మీట్లకే  పరిమితమవుతోంది. 

ఇక అధికార పక్షం గత ప్రభుత్వం పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటోంది.  దీంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇంకా ఎన్నాళ్లీ  బ్లేమ్ గేమ్​లు?  గురుకులాల్లో జరుగుతున్న ఈ  అమానవీయ ఘటనల పట్ల  మానవ హక్కుల కమిషన్ స్పందించేవరకు కూడా ప్రభుత్వానికి సోయి లేదు.  హ్యూమన్ కమిషన్  నివేదిక  కోరితేగానీ  కదలిక రాలేదు. అప్పుడైనా చిత్తశుద్ధితో సమస్యపై దృష్టి పెట్టిందా అంటే అదీ లేదు?  తూతూ మంత్రంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 

కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు