వెలుగు ఓపెన్ పేజీ: రైతుల ఆదాయాన్ని పెంచుతున్న ఫుడ్ ప్రాసెసింగ్

వెలుగు ఓపెన్ పేజీ:  రైతుల ఆదాయాన్ని పెంచుతున్న  ఫుడ్ ప్రాసెసింగ్

రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఆహారశుద్ధి రంగ పరిశ్రమ ఎంతగానో తోడ్పడుతోంది.  దీన్ని గుర్తించి ప్రభుత్వాలు మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాయి. మరో వైపు రెడీ టు ఈట్ ఆహార పదార్థాలకు డిమాండ్ పెరుగుతోంది.  ఈ నేపథ్యంలో  2024లో దాదాపు 36 వేల కోట్ల డాలర్లుగా ఉన్న దేశీయ ఆహార శుద్ధి పరిశ్రమ పరిమాణం  2032 నాటికి 8.8 శాతం వార్షిక వృద్ధి రేటుతో దూసుకుపోతుందని అంచనా.

2025లో 39,950 కోట్ల డాలర్లుగా ఉన్న ఆహార శుద్ధి  విఫణి విలువ 2026లో 43,490 కోట్ల డాలర్లుగా ఉండబోతున్నట్టు  ది  సదరన్  ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నివేదిక తెలుపుతోంది. 2032 నాటికి 73,550 కోట్ల డాలర్లుగా  ఉండవచ్చని అంచనా వేస్తోంది.  భారత  ఆహార పరిశ్రమ భారీ వృద్ధికి సిద్ధంగా ఉంది.  ఏటా ప్రపంచ ఆహార వాణిజ్యానికి దాని సహకారాన్ని పెంచుతోంది.

ఫుడ్  ప్రాసెసింగ్ ద్వారా  రైతులకు మేలు

 ఆహార రంగం  ముఖ్యంగా  ఆహార  ప్రాసెసింగ్  పరిశ్రమలో   విలువ  జోడింపునకు  విస్తృత   సామర్థ్యం ఉంది.  తద్వారా   ఎక్కువ వృద్ధి,   ఎక్కువ  లాభదాయక రంగంగా  ఉద్భవించింది.   ముడి వ్యవసాయ  ఉత్పత్తులను  ఆహార పదార్థాలుగా  మార్చే ప్రక్రియే  ఆహార శుద్ధి.   ఇది  ఉపాధి అవకాశాలను  కల్పిస్తోంది.  టెక్నాలజీ  సహాయంతో   పెద్ద మార్కెట్​గా  ఎదిగింది.   ఫుడ్  ప్రాసెసింగ్  ద్వారా  రైతులకు  మేలు  కలుగుతోంది. మంచి ధర  లభిస్తోంది.  వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందుబాటులోకి  వస్తోంది. ఆహార శుద్ధి రంగ సంస్థలు  నిరంతరం  సాంకేతికతను  వినియోగించుకుంటున్నాయి.  కొత్త కొత్త ఆవిష్కరణలకు తెర తీస్తున్నాయి.  పోషక విలువలపై  ప్రజల్లో కూడా ఆలోచన, తద్వారా  చైతన్యం వచ్చాయి.  రుచితోపాటు  శుభ్రతను కోరుకుంటున్నారు.  ఈ రంగంలో  యువతకు  ఉపాధి  అవకాశాలు  ఎక్కువగా ఉన్నాయి.   రోజురోజుకూ  ఫుడ్   టెక్నాలజిస్టుల  అవసరం  ఏర్పడుతోంది.  వీరికి  కీలక  బాధ్యతలు ఉంటాయి.  శుద్ధి చేసిన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు   చేరే  పంపిణీ  వ్యవస్థను  రూపొందిస్తారు.   ప్రస్తుతం  దేశ ఆహార శుద్ధి  పరిశ్రమ  ప్రగతివైపు పరుగులు తీస్తోంది.  అంతేకాకుండా  ఆహార  వ్యాపారం చెప్పుకోలేనంత  పెద్దదిగా  ఎదుగుతోంది.

ఆహారశుద్ధి రంగంలో పరిశ్రమల ఏర్పాటు

తెలంగాణ  రాష్ట్రం  విషయానికి వస్తే ఆహార శుద్ధి  రంగంలో  పరిశ్రమల  ఏర్పాటుకు  అనుకూల  పరిస్థితులు ఉన్నాయి.  ఇప్పటికే  ఈ రంగంలో  రూ.16 వేల కోట్ల  పెట్టుబడులు రాగా,  అవి  వివిధ దశల్లో ఉన్నాయి .7,150 ఎకరాల్లో  14 స్పెషల్  ఫుడ్  ప్రాసెసింగ్ జోన్లు  ఏర్పాటయ్యాయి.  భవిష్యత్తులో ద్వితీయ, తృతీయ శ్రేణి  నగరాలతోపాటు  పట్టణాల్లోనూ  వీటి ఏర్పాటుకు  ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం  తలపెట్టింది.  నిజామాబాద్,  మహబూబ్ నగర్,  ఖమ్మం,  మెదక్ జిల్లాలతోపాటు వివిధ ప్రాంతాల్లో మరో 20 ఆహార మార్గాలను  ఏర్పాటు  చేస్తోంది.   రైతుల  ఆదాయాన్ని రెట్టింపు చేయడం, అంతర్జాతీయ ప్రమాణాలతో  ప్రాసెసింగ్  కేంద్రాలను  ఏర్పాటు  చేయడం  లక్ష్యంగా  ప్రభుత్వం  ముందుకు సాగుతోంది.  మెగా ఫుడ్ పార్కులు,  ప్రాసెసింగ్  పార్కుల ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు,  వందకుపైగా అంకుర సంస్థలకు మద్దతు ఇవ్వడం వంటి చర్యలతో  తెలంగాణను  దేశంలోనే  ఆహార శుద్ధి హబ్​గా  మార్చడానికి  కృషి చేస్తోంది. 

మెగా ఫుడ్ పార్కులు బలోపేతం


మెగా ఫుడ్ పార్కులను  బలోపేతం చేయడం,  చిన్న తరహా  పరిశ్రమల  మధ్య  పోటీతత్వం పెంచడం,  పంటల  ఆధారిత  మార్కెటింగ్  వసతులు,  నిల్వ  సదుపాయాల కోసం  సమగ్ర  విధానం  తేవాలని  కూడా  నిర్ణయించింది. తెలంగాణ  ఫుడ్  ప్రాసెసింగ్  సొసైటీ  ద్వారా  ప్రైవేటు  పెట్టుబడులు  ఆకర్షించి  ఫుడ్ పార్కులు,  ఫుడ్  ప్రాసెసింగ్ జోన్లు  బలోపేతం  చేయాలని  భావిస్తోంది.  పంటల  దిగుబడి,  శుద్ధి దశల్లో  కొత్త  సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని  ఆవిష్కరణలను  ప్రోత్సహించే  బాధ్యతలను  సంబంధిత శాఖలకు  అప్పగించింది.  ఇక ఈ ఏడాది  చివరినాటికి ప్రధానమంత్రి  కిసాన్  సంపద యోజన కింద 41 మెగా ఫుడ్ పార్కులకు  కేంద్రం ఆమోదం తెలిపింది.  .  2034 నాటికి  ప్రపంచ వ్యాప్తంగా రెడీ టు ఈట్ ఫుడ్  వ్యాపారం 700 బిలియన్  డాలర్లకు పైగా  చేరుకుంటుందని  నిపుణులు అంచనా వేస్తున్నారు.

జి. యోగేశ్వరరావు
జర్నలిస్ట్