పారదర్శకత అనేది కేవలం సుపరిపాలనకు ఒక సూచిక మాత్రమే కాదు.. ఇది ప్రజాస్వామ్యంలో పాలకుల జవాబుదారీతనానికి పునాది. ప్రభుత్వ విభాగాలు రహస్యంగా పనిచేస్తే పౌరులు ప్రజాస్వామ్యంలో చురుకైన భాగస్వాములుగా కాలేరు. సమాచారం ఒక శక్తి. ప్రజాస్వామ్యంలో ఆ శక్తితో కూడిన అధికారం ప్రజల వద్ద ఉండాలి. ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చే వార్షిక నివేదికలు కీలకమైన జవాబుదారీతనంతో సాధకాలుగా పనిచేస్తాయి.
పౌరుల పనితీరును అంచనా వేయడానికి, వనరుల కేటాయింపును ట్రాక్ చేయడానికి, విధాన ప్రభావాలను అర్థం చేసుకోవడానికి, అవసరమైనప్పుడు పథకంలో దిద్దుబాట్లను డిమాండ్ చేయడానికి వీలు కల్పిస్తాయి. సమాచారాన్ని క్రమబద్ధంగా బహిర్గతం చేయని పక్షంలో మంచి ఉద్దేశ్యంతో కూడిన విధానాలు కూడా అస్పష్టతను పెంపొందించడం, అవినీతికి దారి తీయడంతోపాటు సర్కారు, పౌరుల మధ్య సామాజిక ఒప్పందాన్ని దెబ్బతీసే అభ్యాసాలుగా మారతాయి.
భారతదేశ సమాచారహక్కు చట్టం 2005 పౌరులు దరఖాస్తులు దాఖలు చేస్తేనే ఇవ్వాల్సిన బాధ్యత మాత్రమే కాకుండా.. సెక్షన్ 4 కింద అడగకముందే, తనంతట తానే సమాచారం ఇవ్వడాన్ని తప్పనిసరి చేసింది. ప్రతి ప్రభుత్వ సంస్థ, విధులు, నిధులు, బడ్జెట్‌లు, పనితీరు గురించి సమాచారాన్ని స్వచ్ఛందంగా ప్రచురించాలనే ప్రాథమిక సూత్రాన్ని ఈ నిబంధన గుర్తు చేస్తుంది.
అయితే, ఆర్టీఐ చట్టం ఆమోదించిన రెండు దశాబ్దాల తర్వాత కూడా క్రమబద్ధమైన వార్షిక నివేదికల విడుదల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నియమంగా కంటే మినహాయింపుగా మిగిలిపోయింది. తెలంగాణ పోలీసుశాఖ వార్షిక నేర గణాంకాల నివేదిక ఒక ఆదర్శప్రాయమైన సంప్రదాయం. ఈ విధమైన సమాచార విడుదలను అన్ని ప్రభుత్వ విభాగాలకు, ముఖ్యంగా నీరు, అడవులు, భూమి, నేల వంటి కీలకమైన సహజ వనరులను నిర్వహించే వాటికి తక్షణమే విస్తరించాలి.
వార్షిక నేర గణాంకాల నివేదిక
భారతదేశంలోని మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు వార్షిక నేర గణాంకాలను బహిర్గతం చేస్తున్నాయి. ఈ పద్ధతి 1953లో ప్రారంభమైంది. అయితే, ప్రతి సంవత్సరం ముగింపుకు ముందు రాష్ట్ర పోలీస్ శాఖ లేదా డీజీపీ నేరాల గణాంకాలను ఆనవాయితీగా విడుదల చేసే ఒక మంచి సంస్కృతి తెలంగాణలో ఉన్నది. 2025లో పలు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు (డీజీపీలు) ఏడాది చివరిలో నేర గణాంకాలను బహిరంగంగా ప్రకటించారు. కానీ, ఇది అన్ని రాష్ట్రాలలో ఒకే విధంగా లేదు. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో వారి డీజీపీలు లేదా సీనియర్ పోలీసు అధికారులు వార్షిక నేర సమీక్షలను సమర్పించగా, ఇతర రాష్ట్రాలు ప్రధానంగా ఎన్‌సీఆర్‌బీ సమీకృత నివేదికపై ఆధారపడ్డాయి.
తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో తెలంగాణ పోలీసులు క్రమం తప్పకుండా వార్షిక నేర గణాంకాలను ప్రకటిస్తున్నారు. ప్రతి సంవత్సరం చివరిలో డీజీపీ పత్రికా సమావేశాలు, అధికారిక ప్రకటనల ద్వారా అధికారిక వార్షిక నేర సమీక్ష నివేదికను సమర్పిస్తున్నారు. పాలనలో ఉండాల్సిన పారదర్శకత ఈ విధంగా ఉండడం ఆహ్వానించాల్సిందే. ఈ నివేదికలు మీడియాలో విస్తృతంగా కవర్ అయ్యాయి. జవాబుదారీతనంగల యంత్రాంగం విధులలో భాగంగా ఉపయోగపడతాయి. పోలీసింగ్ ఎట్లా ఉందో కూడా మనకు ఈ వార్షిక నివేదికల ద్వారా అర్థం అవుతుంది.
ప్రతి ప్రభుత్వ శాఖ వార్షిక నివేదిక అందజేయాలి
పౌర భద్రతను, పాలనను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే నేర డేటాను అధికారిక అడ్డంకులు లేకుండా అందుబాటులో ఉంచడం సుపరిపాలనలో భాగమే. ఆర్టీఐ చట్టం స్ఫూర్తికి అనుగుణంగా ఈ వార్షిక ప్రకటనలు పాలనలో ఉండాల్సిన పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలపరుస్తుంది. అయితే, గణాంకాలు మాత్రమే సరిపోవు. పొలీస్శాఖ మారుతున్న పరిస్థితులను, తమ శాఖ ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా ప్రకటిస్తే ప్రజలకు అర్థం అవుతుంది. నేర గణాంకాలకు తోడు శాఖాపరమైన గణాంకాలు కూడా విడుదల చెయ్యాలి.
రాష్ట్ర పోలీసుశాఖ గణాంకాలను ప్రకటించిన గణాంకాలకు తోడు పౌరులు తమకు కావాల్సిన సమాచారం పొందడానికి, అభ్యర్థించడానికి ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేయవచ్చు. కానీ, డీజీపీలు ఏటా ప్రకటించే సమాచారం వల్ల ఆర్టీఐ అభ్యర్థనల అవసరం తగ్గుతుంది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రతి సంవత్సరం ప్రచురించే నివేదిక కూడా తగిన సమాచారం పౌరుల ముందు పెడుతున్నది. పౌరులు సమాచార హక్కు దరఖాస్తులు దాఖలు చేయవలసిన అవసరం లేదు.
ముందస్తు సమాచారం అత్యంత అవసరం
కరువులు, వరదలు, భూమి క్షీణతకు సిద్ధం కావడానికి ముందస్తు సమాచారం ఉండడం అత్యంత అవసరం. నీరు, భూమి, నేల, అడవులను నిర్వహించే విభాగాలు స్పష్టమైన గణాంకాలు, వృద్ధి ప్రణాళికలతో వార్షిక, పౌర-స్నేహపూర్వక నివేదికలను ప్రచురించాలి. ఇది సహజ వనరుల పాలనను మరింత పారదర్శకంగా, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతుంది.
నార్వే దేశం చమురు నుంచి వచ్చే ఆదాయం, దాని వలన ఏర్పడే పర్యావరణ ప్రభావాల గురించి అధ్యయనాలు, సావరిన్ వెల్త్ ఫండ్లలో పెట్టుబడులపైన వివరణాత్మక వార్షిక నివేదికలను ప్రచురిస్తుంది. ఇది ప్రపంచ ప్రమాణంగా పరిగణిస్తారు. తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలు, వార్షిక బడ్జెట్ పత్రాలకు దీటుగా, నీటి వనరుల లభ్యత, వినియోగ స్థితిపై వార్షిక నివేదికలను ప్రచురించాలి.
ఆదర్శంగా తెలంగాణ పోలీస్ శాఖ
తెలంగాణ పోలీసులు స్థాపించిన పారదర్శక సంప్రదాయం ముందుకుసాగే మార్గాన్ని ఇతర పాలక విభాగాలకు చూపుతున్నది. వార్షిక నివేదికలు అధికారిక ఆడంబరాలు కావు. పరిపాలనకు భారాలు కూడా కావు. అవి ప్రజాస్వామిక పాలనకు ముఖ్యమైన సాధనాలు. వాటిని సార్వత్రికం చేయడం కేవలం కావాల్సిన సంస్కరణ కాదు, తక్షణ ప్రజాస్వామ్య అవసరం. ప్రతి రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ విభాగం తెలంగాణ పోలీసులు చూపిన ఉదాహరణను అనుసరించాలి. పారదర్శకత సంప్రదాయంగా, అస్పష్టత మినహాయింపుగా మారనివ్వండి.
పౌరులు తమ ప్రభుత్వం ఎలా పని చేస్తుందో, ఎక్కడ విజయవంతమవుతుందో, ఎక్కడ విఫలమవుతుందో, అది ఎలా మెరుగుపడుతుందో అంచనా వేయడానికి అవసరమైన, తగిన సమాచారాన్ని కలిగి ఉండాలి. భారతదేశ ప్రజాస్వామ్యంలో సమాచార హక్కు అధికారిక గుర్తింపు నుంచి క్రమబద్ధమైన క్రియాశీలక చర్యగా వాస్తవ రూపం దాల్చాలి. అస్పష్టత నుంచి పారదర్శకతకు ప్రయాణం చాలా మైలురాళ్లు దాటాలి. అయితే, ఈ ప్రయాణం సమగ్ర వార్షిక నివేదికను ప్రచురించే ప్రతి ప్రభుత్వ శాఖ విధులలో భాగంగా సాధారణ చర్యగా ప్రారంభం కావాలి. అందుకు పాలకుల సంకల్పం మాత్రమే అవసరం.
సమాచారం వెల్లడించని సాగునీటి, వ్యవసాయ శాఖలు
వేల కోట్లు ఖర్చుచేసే సాగునీటి శాఖ అసలు ఏ నివేదికలు ఇవ్వదు. ప్రాజెక్టుల పట్టిక తప్పితే ఇతరత్రా సమాచారం సాగునీటి శాఖ ఇవ్వకపోవడం అన్యాయం. వ్యవసాయశాఖ రైతులకు వివిధ పథకాల రూపేణా అందిస్తున్న నగదు, ప్రోత్సాహకాల గురించిన సమాచారం ఏటా వార్షిక నివేదికల ద్వారా ప్రచురించాలి. మొత్తం సమాచారం ఇవ్వకున్నా కనీసం గణాంకాలు ఇవ్వాలి. వ్యవసాయశాఖ రైతులకు వివిధ సబ్సిడీలు, నగదు బదిలీలను పంపిణీ చేస్తోంది.
ఆయా కార్యక్రమాల ద్వారా ఏటా వేల కోట్లు లక్షలాది మంది లబ్ధిదారులకు చేరుకుంటాయి. 2024-25లోనే రైతుబంధు (పెట్టుబడి మద్దతు), మార్కెట్ కొనుగోలు, పంట బీమా వంటి పథకాలకు రూ.15,000 కోట్లకు పైగా ఖర్చు అవుతుంది. అయినప్పటికీ ఈ సమాచారం పౌరులకు అందుబాటులో లేదు. సమగ్ర వార్షిక నివేదికలుగా సంకలనం చేయడం లేదు.
ఏ పంటలకు గరిష్ట మద్దతు లభించింది? సబ్సిడీ విధానాలు సంవత్సరానికి ఎలా మారాయి? ఎంత మంది రైతులు ఏ పథకాల నుంచి ప్రయోజనం పొందారు? ఇటువంటి ప్రశ్నలకు ఆర్టీఐ దరఖాస్తులు ఇచ్చినా సమాచారం రావడం లేదు. వార్షిక నివేదికలు ఇవ్వడం కనీస బాధ్యత. అయితే, ఈ సంప్రదాయం రాష్ట్రస్థాయిలో లేదు. ప్రతి ఏటా రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ శాఖ ఒక వార్షిక నివేదిక ఇచ్చే సంప్రదాయం ప్రతిష్టించాల్సిన అవసరం చాలా ఉన్నది. భూగర్భ జలశాఖ జలాల గురించి నివేదిక ఇస్తోంది. కానీ, తాము చేసిన, చేస్తున్న, చేయబోతున్న పనుల గురించి చెప్పదు.
డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్
