ప్రభుత్వ ఉద్యోగం అనేది మన దేశంలో అత్యంత గౌరవప్రదమైన బాధ్యతల్లో ఒకటి. లక్షలాది మంది యువత ఎన్నో సంవత్సరాలు కష్టపడి, పోటీ పరీక్షలు రాసి, కుటుంబాల ఆశలను నెరవేర్చుతూ ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత వారికి స్థిరమైన ఆదాయం, సమాజంలో గౌరవం, ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తాయి. అలాంటి విలువైన పదవిలో ఉన్న కొందరు అధికారులు, ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉచ్చులో చిక్కుతున్న వార్తలు తరచూ కనిపిస్తున్నాయి.
ప్రతిసారి అలాంటి వార్త వెలుగులోకి వచ్చినప్పుడు సమాజం అడిగే ఒకే ప్రశ్న ‘ఏమైంది మీకు?’ లంచం తీసుకోవడం చట్టవిరుద్ధమని వారికి తెలియదా? తెలుసు. అవినీతి నిరోధక శాఖ నిఘా ఎలా ఉంటుందో తెలియదా? అదీ తెలుసు. లంచం తీసుకుంటే ఉద్యోగం, ప్రతిష్ట, భవిష్యత్తు ప్రమాదంలో పడతాయని తెలియదా? అది కూడా తెలుసు. అయినప్పటికీ ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు? ఇది కేవలం చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాదు. ప్రజలు ప్రభుత్వ వ్యవస్థపై ఉంచిన విశ్వాసాన్ని దెబ్బతీయడం కూడా.
ఒక సాధారణ పౌరుడు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినప్పుడు తన పని న్యాయంగా, నియమాల ప్రకారం జరుగుతుందని ఆశిస్తాడు. కానీ లంచం లేకుండా పని జరగదనే భావన ఏర్పడితే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నమ్మకం బలహీనపడుతుంది. ఒక అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడినప్పుడు నష్టం అతనికే పరిమితం కాదు. అతని కుటుంబం అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని పిల్లలు సమాజంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. సహచర ఉద్యోగులపై కూడా అనుమానాల నీడ పడుతుంది. ఆ శాఖపై ప్రజల విశ్వాసం తగ్గుతుంది. ముఖ్యంగా నిజాయితీగా పనిచేస్తున్న వేలాదిమంది అధికారుల కృషి కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది.
- ప్రభుత్వ ఉద్యోగం.. ప్రజల తరఫున బాధ్యత
ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం జీతం తీసుకోవడం కాదు. అది ఒక ప్రజా విశ్వాసం. ప్రజల తరఫున అధికారాన్ని వినియోగించే బాధ్యత. ఆ అధికారాన్ని వ్యక్తిగత లాభం కోసం ఉపయోగించినప్పుడు సమాజానికి తప్పు సందేశం వెళ్తుంది. ‘డబ్బు ఉంటేనే పని జరుగుతుంది’ అనే భావన బలపడుతుంది. ఇది సమాజ నైతిక విలువలను క్రమంగా క్షీణింపజేస్తుంది. కొంతమంది అధిక సంపాదన కోరికతో, మరికొందరు ఇతరులతో పోల్చుకోవడం వల్ల, ఇంకొందరు ‘అందరూ చేస్తున్నారు’ అనే అపోహతో అవినీతి వైపు మొగ్గు చూపుతారు. కానీ చరిత్ర మనకు చెప్పిన ఒక సత్యం ఏమిటంటే.. అక్రమంగా సంపాదించిన సంపద ఎన్నడూ శాశ్వత గౌరవాన్ని ఇవ్వలేదు. నిజాయితీతో సంపాదించిన పేరు మాత్రం తరతరాలకు నిలుస్తుంది.
- నిజాయితీ బలహీనత కాదు, గొప్ప బలం
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తనను తాను ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఉద్యోగం కోసం పడిన కష్టం, తల్లిదండ్రుల ఆశలు, కుటుంబ గౌరవం, సమాజంలో సంపాదించిన పేరు.. ఇవన్నీ కొన్ని వేల రూపాయల లంచం కంటే తక్కువా? ఒక క్షణిక ఆశ కోసం జీవితాంతం మచ్చ ఎందుకు మిగుల్చుకోవాలి? ప్రజలు కూడా తమ బాధ్యతను గుర్తించాలి. లంచం ఇవ్వడం కూడా తప్పే. పని త్వరగా జరగాలని లేదా నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందాలని లంచం ఇవ్వడం ద్వారా మనమే అవినీతిని ప్రోత్స హిస్తున్నాం.
అవినీతి నిర్మూలన అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రతి పౌరుడి బాధ్యత కూడా. నిజాయితీ అనేది బలహీనత కాదు. అది ఒక వ్యక్తి గొప్ప బలం. పదవి తాత్కాలికం. అధికారం తాత్కాలికం. సంపద కూడా శాశ్వతం కాదు. కానీ వ్యక్తిత్వం, గౌరవం, మంచి పేరు శాశ్వతమైనవి. పదవీ విరమణ తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తించేది అతని నిజాయితీ, సేవాభావం, విలువలే.
- సోమ శ్రీనివాస్ రెడ్డి
కార్యదర్శి,
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
