ప్రజాస్వామిక విషాదం.. బీజేపీ అక్రమఖాతాలో మరో రాజ్యసభ సీటు!

ప్రజాస్వామిక విషాదం.. బీజేపీ అక్రమఖాతాలో మరో రాజ్యసభ సీటు!

రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించి కేంద్రంలో పట్టు బిగించాలన్న సంకల్పంతో 12 ఏళ్లుగా పావులు కదుపుతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ లక్ష్యానికి చేరుకోవాలంటే మరో 15 స్థానాలు సాధించాలి. 245 స్థానాలు ఉన్న రాజ్యసభలో ఇప్పటికే 149 సంఖ్యా బలంతో పటిష్టంగా ఉన్న ఎన్డీఏ  ప్రజాస్వామ్యబద్ధంగా బలాన్ని పెంచుకోవాల్సిందిపోయి అక్రమ మార్గాలను అనుసరిస్తున్నది. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ,  తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులను తనవైపు లాగేసుకుంది.

  రాజ్యసభ ఎన్నికల్లో  ఓటర్లైన విపక్ష శాసనసభ్యులను ఎక్కడికక్కడ మభ్యపెడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్​లో  రాజ్యసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.  కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ, అందుకు రిటర్నింగ్ ఆఫీసర్ చూపిన కారణాలు తీవ్ర చర్చను రేకెత్తించాయి.


230 సీట్లున్న  మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ బలం 165.  రాజ్యసభ ఎన్నికల్లో  మొత్తం మూడు స్థానాలు గెలవడానికి ఆ సంఖ్యా బలం సరిపోదు.  మరో  పదిమంది శాసనసభ్యుల మద్దతు అవసరం.  అక్కడే బీజేపీ అక్రమానికి తెరలేపింది.  బలం లేకపోయినా మూడవ అభ్యర్థిని రంగంలోకి దింపింది. 

శాసనసభలో  భారత్ ఆదివాసీ పార్టీకి చెందిన ఒక సభ్యుడు తప్ప ఇండిపెండెంట్లు లేరు.  ఇతర పార్టీ సభ్యులూ లేరు. శాసనసభలో64 సంఖ్యా బలం ఉన్న ఇండియా కూటమి  సభ్యులు పదిమంది  క్రాస్ ఓటింగుకు పాల్పడితే తప్ప ఎన్డీఏ మూడవ అభ్యర్థి గెలుపు సాధ్యం కాదు.  అది తెలిసీ ఎన్డీఏ  మూడవ అభ్యర్థిని రంగంలోకి దింపి బహిరంగ కొనుగోళ్ళకు  ద్వారాలు తెరిచింది. 10 కోట్ల వరకు ఆఫర్ ఇచ్చినట్టు కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు.  

కాంగ్రెస్ పార్టీ  తనకున్న సంఖ్యా బలం మేరకు ఒకే  ఒక అభ్యర్థి మీనాక్షి నటరాజన్​ను రంగంలోకి దింపింది.  బీజేపీ బేరసారాల  ప్రమాదం  పసిగట్టిన కాంగ్రెస్ తమ శాసన సభ్యులను  బెంగళూరు తరలించడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకుంది. అనూహ్యంగా విమానం బయలుదేరడానికి అనుమతి లభించలేదు. గంటలకొద్దీ ఆలస్యం జరిగింది. ఈలోగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది.  కేంద్ర ఎన్నికల కమిషన్ తలుపు తట్టినా తుదకు సుప్రీంకోర్టును ఆశ్రయించినా కాంగ్రెస్ కు నిరాశే మిగిలింది.

  • అఫిడవిట్తో  సంబంధంలేని నోటీసుల అంశం

పెండింగ్​లో  ఉన్న ఫిర్యాదు కేసు వివరాలు వెల్లడించకపోవడం అసంపూర్ణమైన ఫామ్ 26 అఫిడవిట్ దాఖలు చేయడం కారణాన రిటర్నింగ్ ఆఫీసర్ ఆమె నామినేషన్​ను తిరస్కరించారు. కానీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ తనపై  క్రిమినల్ కేసులు లేవని,  నమోదైన శిక్షలు లేవని,  వ్యక్తిగత ఫిర్యాదులపై నోటీసులను వెల్లడించే  ప్రత్యేక కాలం ఏదీ లేదని కనుక తాను ఫామ్ 26 సక్రమంగానే సమర్పించానని మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. నామినేషన్ పరిశీలన సమయంలో ఆ ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులు పార్టీ ప్రతినిధులు ఉంటారు. 

అఫిడవిట్​తో సంబంధంలేని నోటీసుల అంశాన్ని ముందుకు తెచ్చి బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడం రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ తిరస్కరించడం  వెనువెంటనే జరిగిపోయాయి.  కేంద్రంలో,  మధ్యప్రదేశ్​ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒక రాజ్యసభ సీటుకోసం అంతగా దిగజారడం బాధాకరం.  ఎన్నికల తంతు ముగిసిన తర్వాత కూడా బీజేపీ తమకు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఉప్పందించారని అంటున్నారు తప్ప మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణలో రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయంలో గల ఔచిత్యాన్ని చర్చించడం లేదు. 

  • విచారణకు సుప్రీంకోర్టు నో

నామినేషన్ల ప్రక్రియలో రిటర్నింగ్ ఆఫీసర్​కు సందేహం తలెత్తినప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్​కు నివేదించవలసి ఉంటుంది.  ఆ దిశగా ఎన్నికల కమిషన్ యంత్రాంగం కసరత్తు చేసిందో లేదో కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.  ఫలితం దక్కలేదు.

 సుప్రీంకోర్టు కూడా మీనాక్షి నటరాజన్ నామినేషన్ వ్యవహారంలో తప్పొప్పుల జోలికి పోలేదు. ఎన్నికల కమిషన్ ఒక ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాక జోక్యం చేసుకోవడానికి నిరాకరించే సంప్రదాయాన్నే కొనసాగించింది.  మీనాక్షి నటరాజన్ తన నామినేషన్ ఆమోదించమని అభ్యర్థించారు తప్ప నిలుపుదలను ప్రశ్నించలేదు. ఎన్నికల ప్రక్రియ ఒకసారి ప్రారంభమయ్యాక  స్తంభింప చేయడం తగదని కోర్టు భావించడం ఆహ్వానించదగ్గదే.  

అలాకాకుండా ప్రక్రియ కొనసాగింపులో భాగంగానే వివాదం న్యాయస్థానం ముందుకు వచ్చినప్పుడు జోక్యం చేసుకోవడం ఉన్నదే. ఆ దిశగా మీనాక్షి  నటరాజన్ కేసు విచారణకు నోచుకుంటే బాగుండేది.  మరోవైపు సుప్రీంకోర్టు కేసు చేపట్టడానికి ఒకరోజు ముందే ఎన్నికల కమిషన్ ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించి ప్రక్రియ ముగించింది. 

ఎన్నికల అనంతరం పరాజితులు వివిధ అభ్యంతరాలతో న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ వారికి ఫలితం దక్కేలోగా పుణ్యకాలం గడిచిపోయిన సందర్భాలు కోకొల్లలు. ఎన్నికల కమిషన్ నిర్ణయాలకు విరుద్ధంగా న్యాయస్థానాలు తీర్పులు చెప్పినప్పటికీ కాలహరణం జరిగి ఆరోపితులైన విజేతలు తమపదవీ కాలాన్ని పూర్తిచేసుకుని పబ్బం గడుపుకున్న ఉదంతాలూ చాలా ఉన్నాయి.
 

  • ప్రజాస్వామిక విషాదం

సాంకేతిక, చట్టపరమైన అంశాలు అలా ఉంచితే,  తగిన బలం లేకపోయినా రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థిని నిలపడంలో గల ఔచిత్యాన్ని బీజేపీ ఇంతవరకు వెల్లడించలేదు.  బీజేపీ మూడవ అభ్యర్థిని రంగంలోకి దింపడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి.  ఒకటి మీనాక్షి నటరాజన్ నామినేషన్​కు ముందే అందిన నోటీసుల సమాచారం.  రెండు గెలవడానికి అవసరమైన పదిమంది కాంగ్రెస్ శాసనసభ్యుల కొనుగోలుకు ఏర్పాట్లు. మొత్తానికి ఏ వ్యయ ప్రయాసలు లేకుండా అదనంగా బీజేపీ ఒక రాజ్యసభ సీటును గెల్చుకుంది. ఈ తతంగంలో  బీజేపీ అగ్రనేతలు వెల్లడించినట్లుగా కాంగ్రెస్  కోవర్టులే  తమకు కోర్టు నోటీసుల ఉప్పందించారన్నది నిజమైతే వారెవరో  వెల్లడించాలి. 

లేదా తమ పార్టీని అపఖ్యాతి పాలు చేసిన బీజేపీ నేతలపై చర్యలకు కాంగ్రెస్ చట్టపరంగా ఉపక్రమించాలి.  లేకపోతే  రెండు పార్టీల నైతికతను,  విశ్వసనీయతను ప్రజలు అనుమానించే అవకాశం ఉంది. ఏది ఏమైనా చాలినంత సంఖ్యాబలం ఉండి అన్ని రకాలుగా అర్హురాలైన మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు ఎన్నిక  కాలేకపోవడం ఒక ప్రజాస్వామిక  విషాదం. 

నామినేషన్ తిరస్కరణకు గురైన రెండవ రోజే అందుకు కారణమైన కేసులో నాంపల్లి న్యాయస్థానం పిటీషన్​ను వెనక్కి పంపడం కొసమెరుపు. ఏదైతేనేం మీనాక్షి నటరాజన్​కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  కోర్టులు జోక్యం చేసుకోలేని రాజ్యాంగబద్ధ వ్యవస్థల నిర్ణయాలకు,  విచక్షణాధికారాలకు ఎగువన ఒక థర్డ్ ఎంపైర్ వ్యవస్థ అవసరమేమో.

- డాక్టర్ అయాచితం శ్రీధర్

Note: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.