10 నెలల్లో.. 1. 47 లక్షల రేషన్ కార్డులు పెరిగినయ్

10 నెలల్లో.. 1. 47 లక్షల రేషన్ కార్డులు పెరిగినయ్
  • కొత్తగా 5,03,903 మందికి రేషన్​
  • పెరిగిన కోటా 3,299 టన్నులు
  • ఉమ్మడి జిల్లాలో 11,54,178 కార్డులు
  • జనవరి కోటా.. 22,132 టన్నులు

యాదాద్రి, వెలుగు:  రాష్ట్ర ప్రభుత్వం  ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 నెలల్లోనే దాదాపు 1. 47 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు ఇచ్చింది.  కార్డు కోసం అప్లికేషన్​ వచ్చిందంటే.. పరిశీలించి అర్హులైతే చాలు ఓకే చేస్తున్నారు. ఇలా ప్రతి నెల వేల సంఖ్యలో కార్డులు జారీ చేస్తున్నారు. దీంతో ప్రతి నెల బియ్యం కోటా పెరుగుతోంది.  పదేండ్ల పవర్​లో ఉన్న బీఆర్​ఎస్​ సర్కారు..  కొత్త రేషన్​ కార్డుల జారీ, మెంబర్స్​ను యాడ్​ చేయడాన్ని పట్టించుకోలేదు. 

ప్రతి స్కీమ్​కు రేషన్ ​కార్డు కచ్చితం కావడంతో అప్పట్లో అనేకమంది ఇబ్బందులకు గురయ్యారు. కాంగ్రెస్ సర్కారు పవర్​లోకి రాగానే ముందుగా వీటిపైనే దృష్టి సారించి మీ సేవతో పాటు ప్రజా పాలనలో భాగంగా నిర్వహించిన గ్రామసభల్లో అప్లికేషన్లను స్వీకరించింది. 

2025 ఫిబ్రవరి నుంచి కార్డుల జారీ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జనవరి 2025లో 10,06,994 కుటుంబాలకు రేషన్​ కార్డులు ఉన్నాయి. 29,82,627  మంది మెంబర్లున్నారు. వీరందరికీ 18,833 టన్నుల బియ్యం పంపిణీ జరిగేదీ. 2025 ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం ప్రతి నెల వేల సంఖ్యలో కొత్తగా రేషన్​ కార్డులను జారీ చేయడం ప్రారంభించింది.

పది నెలల్లో..

ప్రతి నెల చివరి వారంలో సివిల్ సప్లయ్​ డిపార్ట్​మెంట్​ డైనమిక్​ కీ రిజిస్టర్​(డీకేఆర్​)లో రేషన్ కార్డులు, కొత్త మెంబర్ల చేర్పులు, పెరిగిన రేషన్​ కోటా డిటైల్స్​ను అప్​డేట్​ చేస్తోంది. ప్రతి నెల వేల సంఖ్యలో కొత్త రేషన్​ కార్డులను జారీ చేయడంతో పాటు పాత కార్డుల్లో మెంబర్లను ఆడ్​ చేసింది. ఈ లెక్కల ప్రకారం ఫిబ్రవరి 2025 నుంచి 2025 డిసెంబర్​ 22 వరకూ ఉమ్మడి జిల్లాలో 1,47,184 కొత్త కార్డులు జారీ చేసింది. 5,03,903 మందిని మెంబర్లుగా యాడ్​ చేసింది. రేషన్​ కోటా కూడా గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకూ 3,299 టన్నులకు పెరిగింది. కాగా ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 11,54,178 రేషన్​ కార్డులుండగా మెంబర్ల సంఖ్య 34,86,530కు చేరింది. 22,132 టన్నుల బియ్యం పంపిణీ చేస్తోంది. 

కార్డు ఇచ్చిన సర్కారుకు థ్యాంక్స్​

పెండ్లి అయినప్పటి నుంచి రేషన్​ కార్డు కోసం పలుమార్లు అప్లయ్​ చేసినా తీసుకోలేదు. కార్డు ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్లయి చేసినా కార్డు వచ్చింది. నలుగురు సభ్యులున్న మాకు ఐదు నెలలుగా రేషన్​ వస్తోంది. –గుండగోని స్వాతి, బొందుగుల, రాజాపేట మండలం

జనవరి 2025

జిల్లా              కార్డులు    యూనిట్లు       బియ్యం కోటా
                                                                (టన్నుల్లో)
యాదాద్రి       2,16,831    6,59,767            4,215

సూర్యాపేట    3,24,165    9,31,062            5,707

నల్గొండ         4,65,998    13,91,798          8,911

మొత్తం          10,06,994   29,82,627       18,833


జనవరి 2026

జిల్లా               కార్డులు    యూనిట్లు    బియ్యం కోటా 
                                                               (టన్నుల్లో)

యాదాద్రి       2,48,757    7,83,044          4,961

సూర్యాపేట    3,68,330    10,72,789       6,808

నల్గొండ         5,37,091    16,30,697       10,363

మొత్తం         11,54,178    34,86,530       22,132